శరద్ పవార్ విమర్శ
ముంబయి: రాజ్యసభలో గత వారం చోగుచేసుకున్న రభస సందర్భంగా మార్షల్స్‌తో బలప్రయోగం చేయించడం పార్లమెంటేరియన్లపై జరిగిన పరోక్ష దాడిగా ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ అభివర్ణించారు. ప్రభుత్వ చర్యను సమర్థించడానికి ఏడుగురు కేంద్ర మంత్రులు కలసికట్టుగా మీడియా ముందుకు రావడం వారి బలహీనతకు అద్దం పడుతోందని పవార్ వ్యాఖ్యానించారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన 54 సంవత్సరాల పార్లమెంటరీ జీవితంలో సమావేశాలు జరుగుతుండగా 40 మంది మార్షల్స్ సభలోకి రావడం ఎన్నడూ చూడలేదని అన్నారు. సమావేశం జరుగుతుండగా వెలుపలి వ్యక్తులు రాజ్యసభలోకి ప్రవేశించారన్న ఆరోపణలపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని పవార్ అన్నారు. పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై ఏర్పాటుచేసే పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్ నాయకులలో అభిషేక్ మను సింఘ్వి, పి చిదంబరం, కపిల్ సిబల్‌లో ఎవరో ఒకరిని కచ్ఛితంగా నియమించాలని ఆయన అభిప్రాయపడ్డారు.