న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఈ క్రమంలో ముందే చెప్పినట్టుగా భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధుకు ఐస్‌క్రీం తినిపించారు. అంతేగాక అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రాకు చుర్మా రుచి చూపించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని తన నివాసంలో ఒలింపిక్ విజేతలకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారుల విజయాలను, వారి కృషిని కొనియాడారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి అరుదైన రికార్డును సాధించిన సింధును ప్రధాని అభినందించారు.
అంతేగాక జావెలిన్ త్రో విభాగంలో పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాను ప్రశంసలతో ముంచెత్తారు. రెజ్లర్లు దీపక్ పునియా, రవి దహియా, బాక్సర్ లవ్లీనా, హాకీ క్రీడాకారులను ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా వారి విజయ రహాస్యాలను అడిగి తెలుసుకున్నారు. చారిత్రక ప్రదర్శనతో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇక ప్రధాన మంత్రి తమతో ఆత్మీయంగా గడుపడాన్ని క్రీడాకారుల ఆనందానికి అవధులులేకుండా పోయింది. మరోవైపు ఒలింపిక్ విజేలతో ప్రధాని ఫొటోలు దిగారు.