నోబెల్ శాంతిబహుమతి గ్రహీత మలాలా
లండన్: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలతో తాను షాకయ్యానని పాకిస్థాన్‌కు చెందిన యువ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయి అన్నారు. మహిళలు, మైనార్టీలు, మానవ హక్కుల కార్యకర్తల భద్రత పట్ల తాను ఆందోళన చెందుతున్నానంటూ ఆమె ట్విట్ చేశారు. వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక ప్రభుత్వాలకు ఆమె పిలుపునిచ్చారు. పౌరులు, శరణార్థులకు మానవీయ రక్షణ కల్పించాలని కోరారు.
ప్రస్తుతం యుకెలో ఉంటున్న మలాలా కూడా తాలిబన్ల బాధితురాలేనన్నది గమనార్హం. ప్రస్తుతం 24 ఏళ్ల వయసున్న మలాలా పాఠశాల విద్యార్థినిగా ఉన్నపుడే తాలిబన్ల ఆగ్రహానికి గురయ్యారు. పాక్‌లోని స్వాత్ లోయలో బాలికల విద్య కోసం ప్రచారం సాగిస్తున్న సమయంలో మలాలాపై తాలిబన్లు 2012లో కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయాలైన మలాలాను అప్పటి పాక్ ప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం యుకెకు పంపించింది. చికిత్స అనంతరం మలాలా తన తల్లిదండ్రులతో కలిసి అక్కడే ఉంటున్నారు. బాలికల విద్య కోసం ఆమె చేసిన కృషికి 2014లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.