Friday, October 18, 2024

దళిత దీప్తి

- Advertisement -
- Advertisement -

CM KCR launches Dalit Bandhu

 

ఎంతటి చీకటి మహా వృక్షాన్నయినా ఒక చిన్న వెలుగు కత్తితో మొదలంటా నరికేయ వచ్చు, కావల్సిందల్లా నిండు నిజాయితీ, ప్రణాళికాబద్ధ కృషి. ప్రగతి శీల రాజ్యాంగాన్ని రచించుకొని, ఆధునిక భారతాన్ని నిర్మించుకోవాలని సంకల్పం వహించి ఏడు దశాబ్దాలు గడిచిపోయినా దేశంలో సమ భావన, సమ పంపిణీ చోటు చేసుకోలేదు. ఆర్థిక వ్యత్యాసాలు, సామాజిక తేడాలు, అణచివేతలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తరతరాలుగా వివక్షకు గురి అవుతూ నోటికీ చేతికీ అందని కటిక దారిద్య్రంలో మలమలమాడుతున్న దళితుల బతుకుల్లో అంధకారం మరింత దట్టమవుతున్నది.

వారి జీవితాలను బాగు పరచడానికి, చేయందించి వారిని ప్రధాన సామాజిక వాహినిలో అంతర్భాగం చేయడానికి తగిన పకడ్బందీ కృషి జరగకపోడమే ఇందుకు కారణం. అందువల్లనే వారు ఇప్పటికీ జాతి గమనంలో వెనుకబడిపోయే ఉన్నారు. దేశ పటంలో ఇది ఒక అఖాతంగా కొనసాగుతున్నది. దీనిని పూడ్చడానికి తీసుకునే ఏ పాటి చొరవనైనా వేనోళ్లతో కొనియాడవలసిందే. జాతి వదనం మీది ఈ మచ్చను తొలగించడానికి జరిగే ఎటువంటి కృషినైనా మెచ్చుకొని దానికి హృదయపూర్వకమైన మద్దతు ఇవ్వవలసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేధా పుత్రిక దళితబంధును ఇటువంటి ఒక మంచి ప్రయత్నంగా, గొప్ప ముందడుగుగా పరిగణించి తీరాలి. ప్రగతిశీల సమాజాన్ని, సమానత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్కరి పరిపూర్ణమైన మద్దతుకు ఇది అర్హమైనది. ప్రతి దళిత కుటుంబానికి పూర్తి సబ్సిడీతో రూ. 10 లక్షలు కేటాయించి వారు కోరుకునే ఉపాధి ప్రాజెక్టును పటిష్ఠమైన పునాదుల మీద నెలకొల్పి అది లాభసాటిగా నడిచేలా ప్రభుత్వం సహాయ సహకారాలందించడం ఈ పథకంలోని విశిష్టత. ముఖ్యమంత్రి కెసిఆర్ మాటల్లోనే చెప్పాలంటే ఈ పథకం కింద ఇప్పుడు పెట్టే రూ. 10 లక్షలు ఏడాది తిరిగే సరికి రూ. 20 లక్షలు కావాలి. ‘తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి మన దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందాలన్నదే దళిత బంధు పరమోద్దేశం’ అని కెసిఆర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లిలో సోమవారం నాడు ఈ పథకాన్ని సమధికోత్సాహ వాతావరణంలో ప్రారంభిస్తూ ప్రకటించారు.

నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కొన్ని శతాబ్దాలుగా అట్టడుగున తొక్కి పెట్టి పేదరికానికి, న్యూనతకు నడయాడే రూపాలుగా చేసి కాల్చుకు తింటున్న దళితులను ఆ వివక్ష నుంచి, దోపిడీ నుంచి బయటపడవేయడమంటే సాధారణ విషయం కాదు. అందుకు ఎంతో క్రాంత దృష్టితో కూడిన కృషి అవసరమవుతుంది. అటువంటి మహోన్నత సంకల్పం ఫలితమే ఈ దళిత బంధు పథకమని అవగతమవుతున్నది. ఎంతో మేధా మథనం చేసి ఏడాది క్రితమే ఈ పథకానికి రూపకల్పన చేశానని, కరోనా కారణంగా అమలు ఆలస్యమైందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంత వరకు జరుగుతూ వస్తున్నట్టు తాత్కాలికమైన, స్వల్ప మాత్రపు సబ్సిడీయో, సహాయమో అందించి చేతులు దులుపుకోడం కంటే రూ. 10 లక్షల విశేష మొత్తాన్ని ఒక్కో దళిత కుటుంబం పేరిట పెట్టుబడిగా పెట్టి వారిని సమర్థులైన వ్యాపారులగా తీర్చిదిద్ది ఇంతటి పోటీ ప్రపంచంలో వెనుకడుగు లేకుండా ముందుకు తీసుకు వెళ్లాలనుకోడం సాధారణ విషయం కాదు.

ఎందుకైనా మంచిదని, లబ్ధిదారులకు ఎప్పుడు ఎటువంటి అవాంతరం ఎదురైనా ఆదుకోడానికి ఈ రూ. 10 లక్షల్లో రూ. 10 వేల వంతున పక్కనపెట్టి రూ. పాతిక వేల కోట్ల రక్షణ నిధిని ఏర్పాటు చేయదలచడం ఎంతైనా హర్షించదగిన విషయం. ఆశించిన గమ్యాన్ని ఈ పథకం ముద్దాడగలిగితే తెలంగాణలోని దళిత జనం కెసిఆర్ అన్నట్టు ధనిక జనంగా మారుతారు, వారి బిడ్డలు ఘనమైన భవిష్యత్తును చూరగొని సంపద సృష్టిలో సమర్థులైన భాగస్వాములు కాగలుగుతారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న అమానవీయ దురాచారం ఒకటి పూర్తిగా అంతరించిపోడానికి మార్గం సుగమమవుతుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించిన దానిని బట్టి రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలున్నాయి. ఎంపిక పద్ధతికి స్వస్తి చెప్పి ఈ కుటుంబాలన్నింటినీ ఈ పథకం ఛత్రఛాయల్లోకి తేవడానికి రూ. 1.70 లక్షల కోట్లు అవసరమవుతుందని దానిని సమకూర్చడం ప్రయాసతో కూడుకొన్న పని ఏమీ కాదని కూడా ముఖ్యమంత్రి పలికిన పలుకులు ఆయన దృఢ దీక్షను ప్రతిధ్వనించాయి. ఉద్యోగం చేస్తున్న దళితులకు కూడా పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇటీవల దత్తత గ్రామం వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింప చేయడానికి రూ. 7 కోట్ల 60 లక్షలు విడుదల చేశారు. హుజూరాబాద్‌లోని 21 వేల పైచిలుకు కుటుంబాల కోసం ఇప్పటికే రూ. 500 కోట్లు విడుదల చేశారు. త్వరలోనే రూ. 2 వేల కోట్లు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. దళిత బంధు రూపంలో మొట్టమొదటి సారిగా పురివిప్పుకున్న ఈ చరిత్రాత్మక అధ్యాయం భవిష్యత్తులో దేశమంతటినీ ఆకర్షించి నవనవోన్మేష భారతానికి నాంది పలకగలదని ఆశిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News