ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె) అధ్యక్షునిగా సుల్తాన్ మహమూద్‌ను ఆ ప్రాంత శాసనసభ మంగళవారు ఎన్నుకుంది. జులై 25న జరిగిన ఎన్నికల్లో అధికార పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పిటిఐ) మహమూద్‌ను బలపరిచింది. మహమూద్‌కు 34 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి, ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి మియా అబ్దుల్ వహాద్‌కు 16 ఓట్లు లభించాయి. ఆగస్టు 24న పదవీ విరమణ చేయనున్న సర్దార్ మసూద్ ఖాన్ నుంచి మహమూద్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడైన మహమూద్ 1996 జులై నుంచి 2001 జులై వరకు పిఓకె ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. తన దురాక్రమణను చట్టబద్ధం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బూటకపు ఎన్నికలను పాకిస్తాన్ నిర్వహిస్తోందని భారత్ గతంలో విమర్శించింది. ఈ అంశంపై తమ నిరసనను తెలియచేస్తున్నట్లు భారత్ తెలిపింది.
Sultan Mahmood Elected of as POK President