పౌరులు స్వేచ్ఛగా తిరుగొచ్చు అంటూనే ఇళ్లలోకి ప్రవేశించి లూటీలు
భారత్ నిర్మించి ఇచ్చిన పార్లమెంట్ భవనంలో తాలిబన్ల హల్‌చల్
చిన్న పిల్లల పార్కులు, జిమ్‌లలో సరదాగా ఆటలు
కాబూల్ : ప్రపంచదేశాలతో పాటు సొంత దేశస్తులు భయపడినట్టే తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వారి అరాచకం తీవ్ర రూపం దాల్చుతోంది. ఎలాంటి దాడులు చేయమని ఇచ్చిన హామీని తాలిబన్లు ఉల్లంఘిస్తున్నారు. దీంతో ఇప్పుడు కాబూల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబూల్‌లో ఇంటింటిని గాలిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, భద్రతా సిబ్బంది వివరాలు సేకరించారు. ఇంకా ఇళ్లలోకి ప్రవేశించి నగదు లూటీ చేస్తున్నాడు. అడ్డు వచ్చిన వారిపై తీవ్రంగా దాడులు చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ఇక జైళ్లలో బందీగా ఉన్న తమ మద్దతుదారులను విడుదల చేస్తున్నారు. ఈ అరాచక దృశ్యాలు సోషల్ మీడియాలో తాలిబన్లు పోస్టు చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా పూర్తిగా మూసివేసింది.
అఫ్గాన్ పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి వెంటనే చొరవ తీసుకోవాలని చాలా దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోవైపు 90వేల డాలర్ల ఖర్చుతో భారత్ నిర్మించి ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్‌కు బహుమతిగా ఇచ్చిన పార్లమెంట్ భవనంలో సాయుధులైన తాలిబన్లు హల్‌చల్ చేశారు. అందులో నాయకుల కుర్చీల్లో కూర్చొని వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. 2015లో పార్లమెంట్ భవంతిని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి ప్రసంగించారు. ఇక కాబూల్‌లో చిన్న పిల్లల పార్కుల్లోనూ తుపాకులు చేతపట్టుకుని తిరుగుతూ తాలిబన్లు భయకంపితులను చేశారు. పిల్లల ఆటవస్తువులతో సరదాగా గడిపారు. జిమ్‌లలోనూ హల్‌చల్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.