శివసేన ఎంపి రౌత్ విమర్శ
ముంబయి: వివిధ రాష్ట్రాలలో కేంద్ర మంత్రులు నిర్వహిస్తున్న జన ఆశీర్వాద్ యాత్ర కరోనా థర్డ్ వేవ్‌ను ఆహ్వానించడమేనని శివసేన ఎంపి సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కాస్త ఓపిక పట్టాలని తాము బిజెపికి సూచించినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే బిజెపి నాయకులు థర్డ్ వేవ్‌ను ఆహ్వానం పలుకుతున్నారని విమర్శించారు. దేశంలోని అత్యుత్తమ ఐదుగురు ముఖ్యమంత్రులలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఒక మీడియా సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలలో చోటు దక్కడం గురించి విలేకరులు ప్రశ్నించగా ఈ సర్వేను బూటకంగా చిత్రీకరించిడానికి బిజెపి ప్రయత్నిస్తోందని, బిజెపికి చెందిన ముఖ్యమంత్రులెవరికీ ఇందులో చోటు దక్కకపోవడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ఎదుగుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.