ఐదో స్థానంలోనే కోహ్లి, టాప్‌లోనే కమిన్స్
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న విషయం తెలిసిందే. లార్డ్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 180 పరుగులు చేశాడు. దీంతో టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రూట్ అనూహ్యంగా రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. టాప్ ర్యాంక్‌లో ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కంటే రూట్ కేవలం 8 రేటింగ్ పాయింట్లు మాత్రమే వెనకబడి ఉన్నాడు. రానున్న మ్యాచుల్లో ఇదే జోరును కొనసాగిస్తే రూట్ టాప్ ర్యాంక్‌కు చేరుకున్నా ఆశ్చర్యం లేదు. విలియమ్సన్ 901 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. రూట్ 893 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో మూడో, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్ 878 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. ఇక టీమిండియా కెప్టెన్ ఐదో, రోహిత్ శర్మ ఆరో, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏడో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తాజా ర్యాంకింగ్స్‌లో 8వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) తొమ్మిదో, క్వింటాన్ డికాక్ (దక్షిణాఫ్రికా) పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ 908 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో, కివీస్ స్పీడ్‌స్టర్ టిమ్ సౌథి మూడో ర్యాంక్‌లో నిలిచారు. జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా), నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్)లు నాలుగు, ఐదు ర్యాంక్‌లను సొంతం చేసుకున్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత స్టార్ రవీంద్ర జడేజా మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. రవిచంద్రన్ అశ్విన్ నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. జేసన్ హోల్డర్ (విండీస్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.