50 శాతం విద్యార్థులకే అనుమతి
చెన్నై: సెప్టెంబర్ 1 నుంచి 9,10,11,12 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు తెరవాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. బోధన,బోధనేతర సిబ్బంది అంతా టీకాలు వేయించుకోవాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్‌కు అర్హత ఉన్న విద్యార్థులు కూడా టీకాలు వేయించుకోవాలని సూచించింది. 50శాతం విద్యార్థులనే తరగతులకు అనుమతించాలని, భౌతిక దూరం నిబంధన పాటించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. వారానికోసారి ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ నిర్ధారణ అయినవారికి వైద్య సదుపాయం కల్పించాలని, పాఠశాలకు అనుమతించొద్దని సూచించింది. పాఠశాల యాజమాన్యాలు శానిటైజర్లు,సబ్బులు అందుబాటులో ఉంచాలని, ఇమ్యూనిటీని పెంచే విటమిన్ ట్యాబ్లెట్లను విద్యార్థులకు అందించాలని సూచించింది. తమిళనాడులో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆ రాష్ట్రంలో 1804 కేసులు నమోదయ్యాయి.