Monday, November 25, 2024

అడ్డగోలు అరెస్టులు తగవు

- Advertisement -
- Advertisement -
Arrest is not always a must says Supreme Court
రాజ్యాంగ విరుద్ధం స్వేచ్ఛకు భంగం
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం
విచారణకు సహకరిస్తే కస్డడీ అనుచితం

న్యూఢిల్లీ: వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ విద్యుక్త ధర్మాలలో ప్రధానమైనదని, ఈ అంశానికి భంగకరంగా వ్యక్తుల అరెస్టులు జరగరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టబద్ధం కాబట్టి అరెస్టు చేయవచ్చు అనే రివాజు సరికాదని, ఈ క్రమంలో వ్యక్తుల స్వేచ్ఛ అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఏడేళ్ల క్రితం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కేసులో ఓ వ్యక్తి పెట్టుకున్న ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అరెస్టు జరగాలనే పద్ధతిలో అరెస్టులకు దిగితే అది వ్యక్తి ఆత్మగౌరవానికి ,అభిమానానికి విఘాతం అవుతుందని ధర్మాసనం పేర్కొంది. అరెస్టులకు సంబంధించి కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుందని, వ్యక్తుల గౌరవానికి సంబంధించిన అంశాలే అన్నింటికన్నా ప్రధానంగా తీసుకోవాలని న్యాయమూర్తులు సంజయ్ కిషన్, హృషికేశ్ రాయ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది.

ఏదేనీ కేసులో ఎవరైనా నిందితుడు సమన్లకు బేఖాతరు చేస్తారని దర్యాప్తు అధికారి భావించకపోతే అటువంటి వ్యక్తి (ఆమె కానీ ఆయన కానీ) ని కోర్టులో కస్టడీ ద్వారా హాజరుపర్చాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. వ్యక్తుల ఆత్మగౌరవం, అభిమానానికి రాజ్యాంగ విధిగా రక్షణ కల్పించిందని, వీటిని నిలబెట్టడం రాజ్యాంగపరంగా విద్యుక్త ధర్మం అని తేల్చిచెప్పారు. అరెస్టులు తరువాతి క్రమంలో కోర్టులలో హాజరుపర్చడానికి ప్రత్యేక సందర్భాలు ఉండాలి. కస్టడీలోకి తీసుకుని కేసు దర్యాప్తు జరగాల్సినప్పుడు. లేదా అత్యంత క్రూరమైన నేరాల విషయంలో నిందితుడిని కోర్టుకు హాజరుపర్చినప్పుడు లేదా నిందితుడు సాక్షులను బెదిరించే అవకాశం ఉన్నప్పుడు లేదా విచారణ క్రమంలో తప్పించుకునే వీలున్నప్పుడు అరెస్టుకు దిగాల్సి ఉంటుంది. అరెస్టులు యధాలాపంగా , వాటిని చూపించాల్సి ఉంది కాబట్టి చేసి కోర్టుకు తీసుకువెళ్లడంగా ఉండకూడదని, అరెస్టులను ఆషామాషి వ్యవహారంగా భావించారని ధర్మాసనం తెలిపింది.

1994లో అత్యున్నత న్యాయస్థానం అరెస్టుల సందర్భాలలో పోలీసు అధికారుల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ఏఏ సందర్భాలలో అరెస్టుకు దిగాల్సి ఉంటుంది? అనే అంశాలపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు వెలువరించిందని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే ఇప్పుడు వీటికి విరుద్ధంగా జరుగుతోందని ఆక్షేపించింది. చార్జీషీటులను ఐపిసి సెక్షన్ల పరిధిలో పరిగణనలోకి తీసుకోవడానికి అరెస్టు అనేదే ముందస్తు అత్యవససర ప్రక్రియ అని ట్రయల్ కోర్టులు చెపుతున్నట్లు పేర్కొంది. అయితే సెక్షన్ 170 ప్రకారం చూస్తే ఎక్కడా నిందితుడిని పోలీసు లేదా జుడిషియల్ కస్టడీ ద్వారా హాజరుపర్చాల్సిన అవసరం ఉందని చెప్పలేదని, చార్జీషీట్ దాఖలు దశలో సదరు నిందితుడిని కేవలం సంబంధిత దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరుపరిస్తే సరిపోతుందని పేర్కొన్నారని ధర్మాసనం వివరణ ఇచ్చింది.

అరెస్టును చూపడం చట్టబద్ధంగా ఉందని పేర్కొంటూ అరెస్టుకు దిగడం పరిపాటి అయిందని, అన్ని కేసులకు దీనిని వర్తింపచేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా గుజరాత్ హైకోర్టు ఆదేశాలు కొట్టివేసిన సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ కోరిన నిందితుడు ఎప్పటికప్పుడు దర్యాప్తు అధికారిని కలుస్తూనే ఉన్నట్లు, తరువాతి దశలోనే తమ ముందుకు (సుప్రీంకోర్టుకు) హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వచ్చినట్లు తెలిపింది. దర్యాప్తు అధికారి ముందుకు వస్తున్న వ్యక్తిని అరెస్టు చేయాలనే ప్రోద్బలం ఎందుకనేది అర్ధంకాని విషయం అని, దీనిని తాము సమర్ధించే విషయం కాబోదని ధర్మాసనం చురక పెట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News