కీలక పత్రాల కోసం వెతికి ఉంటారని అనుమానం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్నామని పైకి చెబుతున్న తాలిబన్లు వాస్తవంలో మాత్రం తమ సహజసిద్ధ అరాచకవైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత భారత్ సహా చాలా దేశాలు అఫ్ఘన్‌లోని తమ దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసి సిబ్బందిని స్వదేశాలకు తరలించాయి. అయితే ఖాళీగా ఉన్న ఆ ఆఫీసుల్లోకి తాలిబన్లు చొరబడి కీలక పత్రాలకోసం తనిఖీ చేసినట్లు తెలిసింది. అఫ్ఘన్‌లోని కాందహార్, హెరాత్ నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో గత బుధవారం తాలిబన్లు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసిందని భారత ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. కీలక పత్రాలు ఏమయినా దొరుకుతాయేమోనని వారు ఇలా ప్రయత్నించినట్లు సమాచారం. అయితే అక్కడ ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో కాన్సులేట్ల వద్ద ఉన్న వాహనాలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో వైపు జలాలాబాద్, కాబూల్‌లో ఉన్న కాన్సులేట్, ఎంబసీల్లో తాలిబన్లు సోదాలు చేసారా అన్న దానిపై స్పష్టత లేదు.‘ మేము దీన్ని ముందే ఊహించాం. దౌత్య కార్యాలయాలను ధ్వంసం చేసిన తాలబన్లు అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలను తీసుకెళ్లారు’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గత ఆదివారం కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు విజయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులు క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారడంతో భారత్ అఫ్ఘన్‌లోని తమ దౌత్య సిబ్బందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకువచ్చింది.
దాడులు జరపబోమంటూ సందేశాలు
మరోవైపు ఈ దాడులు జరగడానికి కొద్ది రోజుల ముందు భారత్ కాబూల్‌లోని తమ దౌత్య సిబ్బందిని తరలించాలని తాము కోరుకోవడం లేదంటూ తాలిబన్లు భారత ప్రభుత్వానికి సందేశం పంపించారు. భారత దౌత్య సిబ్బంది, భద్రతా సిబ్బందికి ఎలాంటి హానీ తలబెట్టబోమని పేర్కొంటూ ఖతర్‌లోని తాలిబన్ కార్యాలయంనుంచి ప్రభుత్వానికి సందేశాలు అందినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లాంటి ఉగ్రసంస్థల మాదిరి తాము భారత దౌత్య కార్యాలయంపైన కానీ, సిబ్బందిపైన కానీ ఎలాంటి దాడి జరపబోమని, అందువల్ల భయపడాల్సిన పని లేదని కూడా తాలిబన్లు ఆ మెస్సేజిల్లో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాలిబన్ రాజకీయ విభాగం చీఫ్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ కాబూల్, ఢిల్లీలోని తమ కాంటాక్ట్‌ల ద్వారా ఈ సందేశాలను పంపించారు. అయితే భద్రతా కారణాల దృష్టాను, ఈ ఉగ్రవాద సంస్థలనుంచి ముప్పు ఉన్నట్లు ఇంటెలిజన్స్ వర్గాలు సూచించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కాబూల్‌నుంచి తన దౌత్య సిబ్బందిని, ఇతర ఉద్యోగులను స్వదేశానికి తీసుకు రావాలని నిర్ణయం తీసుకుంది.