న్యూఢిల్లీ : జపాన్ రాజధాని టోక్యో వేదికగా త్వరలో జరిగే పారా ఒలింపిక్స్‌లో పతకాల పంట పండిస్తామనే ధీమా భారత పారాలింపిక్స్ కమిటీ సెక్రటరీ జనరల్ గురుశరన్ సింగ్ జోస్యం చెప్పారు. టోక్యో క్రీడల్లో బరిలోకి దిగుతున్న భారత అథ్లెట్ల బృందం చాలా పటిష్టంగా ఉందన్నారు. ఈ ఒలింపిక్స్‌లో భారత్ కనీసం ఐదు స్వర్ణాలతో సహా 15 పతకాలు గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. భారత్‌లో ప్రతిభావంతులైన పారా అథ్లెట్లకు కొదవలేదన్నారు. సామర్థం మేరకు రాణిస్తే టోక్యో క్రీడల్లో పతకాల పంట పండించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టోక్యో క్రీడల్లో భారత్ మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమన్నారు.
కొన్నేళ్లుగా ఒలింపిక్స్ కోసం భారత పారా అథ్లెట్లు ఎంతో చెమటోడ్చుతున్నారన్నారు. క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, షూటింగ్, ఆర్చరీ విభాగాల్లో భారత్‌కు తప్పకుండా పతకాలు లభిస్తాయనే ధీమాను గురుశరణ్ సింగ్ వ్యక్తం చేశారు. ఇక క్రీడల కోసం భారత అథ్లెట్లు ఎంతో పకడ్బంధీగా సిద్ధమయ్యారన్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పతకాల పంట పండించేందుకు తహతహలాడుతున్నారన్నారు. ఇతర దేశాలకు దీటుగా ఈసారి భారత్ కూడా ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ఇక ప్రధాన మంత్రి తమ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపారన్నారు. ఇది కూడా అథ్లెట్ల ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసిందన్నారు. ఇక రెగ్యూలర్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించడం కూడా పారా ఒలింపియన్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందన్నారు.
వారిని స్ఫూర్తిగా తీసుకుని భారత అథ్లెట్లు టోక్యో క్రీడల్లో పతకాల పంట పండిస్తారనే ధీమాను గురుశరణ్ వ్యక్తం చేశారు. ఇక గతంతో పోల్చితే అంతర్జాతీయ క్రీడల్లో భారత పారా అథ్లెట్లు కొంత కాలంగా నిలకడైన ప్రదర్శన చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు అథ్లెట్లు సిద్ధమయ్యారన్నారు. ఇక భారత ఒలింపిక్ సంఘం, క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు పలు కార్పొరేట్ సంస్థలు కూడా క్రీడాకారులకు ఆర్థికంగా అడ్డంగా నిలిచాయన్నారు. ఇది కూడా క్రీడాకారులకు కలిసి వచ్చే అంశంగా మారిందన్నారు. అన్ని అనుకున్నట్టు సాగితే ఈ పారా ఒలింపిక్స్‌లో భారత్ కనీసం 20 పతకాలు గెలవడం ఖాయమని గురుశరణ్ సింగ్ జోస్యం చెప్పారు. కాగ ఈ క్రీడల కోసం 54 మందితో కూడిన భారత బృందం ఇప్పటికే టోక్యోకు బయలుదేరి వెళ్లింది.