ప్రభుత్వం తరపున సాక్షిగా హాజరైన హోంశాఖ కార్యదర్శి
మనతెలంగాణ/హైదరాబాద్ : దిశ నిందితుల ఎన్కౌంటర్పై త్రిసభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సిర్పుర్కర్, సభ్యులు రేఖ, కార్తికేయన్లు శనివారం నాడు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అఫిడవిట్ల వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు విచారణ చేపట్టారు. ఈక్రమంలో ఈ విచారణకు ప్రభుత్వం తరఫున సాక్షిగా హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా హాజరై ఎన్కౌంటర్ చోటు చేసుకున్న తేదీ నుంచి అఫిడవిట్లు సమర్పించిన వరకు అన్ని వివరాలను రవిగుప్త కమిషన్కు వివరించారు. అదేవిధంగా మస్తాన్ వలితో పాటు పలువురు న్యాయవాదులు ఎన్కౌంటర్పై తమకున్న సందేహాలను కమిషన్ ముందుంచడంతో వాటికి హోంశాఖ కార్యదర్శి రవిగుప్త సమాధానమిచ్చారు. ఇదిలావుండగా దిశ త్రిసభ్య కమిషన్ ఇప్పటి వరకు ప్రజల నుంచి 1,333 అఫిడవిట్లు, పోలీసులు, ప్రభుత్వం, సాక్షులు, వైద్యుల నుంచి 103 అఫిడవిట్లు స్వీకరించింది.
కమిషన్ ఇప్పటి వరకు 16 సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలీసులు సమర్పించిన 24 అఫిడవిట్లలో కొన్నింటికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్పై మృతుల తల్లిదండ్రులతో పాటు, మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో త్రిసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తూ 2019 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది చివర్లో సాధ్యమైనంత వరకు దిశ ఎన్కౌంటర్పై విచారణను ముగించాలని త్రిసభ్య కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ప్రభుత్వాన్ని విచారించింది. ఈక్రమలో ఈ నెల 26,27,28 తేదీల్లో సాక్ష్యులను విచారించనుంది.
ఇది జరిగింది
దిశ అనే యువతి 2019 నవంబరు చివరి వారంలో హైదరాబాద్ శివార్లలో హత్యాచారానికి గురైంది. నాలుగు రోజుల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. డిసెంబరు 6న దిశ వస్తువుల సేకరణ కోసం వచ్చినప్పుడు నిందితులు తమ తుపాకులు లాక్కోవడంతో కాల్పులు జరిపామని.. ఎన్కౌంటర్లో నలుగురు నిందితులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నిందితుల ఎన్కౌంటర్పై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. 2019 డిసెంబరు 12న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికాస్ శ్రీధర్ సిర్పుర్కర్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖ, సిబిఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్లను సభ్యులుగా నియమించింది. 2020 జులైలో కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ మరో ఆరు నెలలు గడువు కోరింది. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2021 జనవరిలో మరోసారి గడువు పొడిగింపు కోరింది. రెండోసారి ఇచ్చిన గడువు కూడా జులైతో ముగియడంతో ఇంకోసారి పొడిగింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరిపి… వాదనలు విన్న సుప్రీంకోర్టు కమిషన్ విచారణ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది.