Wednesday, November 20, 2024

రాష్ట్రానికి కిషన్‌రెడ్డి ఏం చేశారు?

- Advertisement -
- Advertisement -

Errabelli and Balka Suman fires on Union minister Kishan reddy

బిజెపి అంటే అమ్మకం.. టిఆర్‌ఎస్ అంటే నమ్మకం
ధ్వజమెత్తిన మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రమంత్రిగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్‌లు డిమాండ్ చేశారు. న్యాయంగా రావాల్సిన నిధుల కంటే ఆయన ఒక్క రూపాయి అయినా రాష్ట్రానికి ఇప్పించగలిగారా? అని నిలదీశారు. జన ఆశీర్వాద సభలో కిషన్‌రెడ్డి చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలు అని వారు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన హామీలపై నోరు మెదపలేని ఆయన టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే విభజన హామీల్లో ఏ ఒక్కదానిని అయినా కేంద్రం నుంచి సాధించి తీసుకరావాలని వారు సవాల్ విసిరారు.

శనివారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హయంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను భారీగా పెంచారని విమర్శించారు. దీని వల్ల నిత్యవసర వస్తువుల ధరలు మండిపోతున్నాన్నారు. దీనిపై బిజెపి నాయకులకు ఏమైనా సోయి ఉందా? అని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మారుతున్నాయన్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా పలుమార్లు ప్రశంసించిందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి గుర్తుచేశారు. దీనికి కేంద్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. కనీసం విభజన చట్టంలోని హామీలను అమలు చేయటంపై కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించరని నిలదీశారు.

కేబినెట్ మంత్రి స్థానంలో ఉండి కిషన్‌రెడ్డి హుందాగా ప్రవర్తించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. అంతే చిల్లర రాజకీయలు చేసి పరువు తీసుకొవద్దన్నారు. పర్యాటక రంగంలో తెలంగాణ వెనుకబడిందని, దీనికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పాలన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో బిజెపి అంటేనే మోసం చేసి అధికారంలోకి వచ్చే పార్టీ అని ప్రజల్లో భావన ఉందని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. కేంద్రానికి వివిధ సుంకాల రూపంలో ఇప్పటి వరకు రూ. 2 లక్షల70వేల కోట్లు కట్టామన్నారు. కానీ రాష్ట్రానికి లక్షా 50 వేల కోట్లు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా రాలేదని ఆయన మండిపడ్డారు.

బిజెపి పాలిత ప్రాంతాల్లో ఇవ్వాల్సిన దానికంటే ఎందుకు ఎక్కువ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి కిషన్‌రెడ్డి కేబినెట్ హోదా వచ్చినందుకు తెలంగాణ ప్రజలు హర్షించారన్నారు. కానీ ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం అంటూ ఏదీలేదన్నారు. బండి సంజయ్‌లా పిచ్చి పిచ్చి మాటలు కిషన్‌రెడ్డి బంద్ చేయాలని సూచించారు. బండి సంజయ్ మాటలతోనే బిజెపి రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాల్లో ఘోరంగా దెబ్బతిన్నదన్నారు. కిషన్ రెడ్డి చేస్తున్న యాత్రను ఒక విఫల యాత్రగా ఆయన అభివర్ణించారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ లేదని కేంద్రం సిగ్గు లేకుండా చెప్పిందని, అలాగే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీకి మొండి చేయి చూపారని ఆయన మండిపడ్డారు. ఇంకెందుకు ప్రజలు బిజెపి మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు.

కిషన్‌రెడ్డి తన స్థాయిని దిగజార్చి మాట్లాడుతున్నారు

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ స్థాయికి కిషన్ రెడ్డి దిగజారారని బాల్కసుమన్ మండిపడ్డారు. కిషన్‌రెడ్డికి మాట్లాడటానికి ఏమీలేకనే కుటుంబ, ,వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారన్నారు. బిజెపిలో వారసత్వంగా వచ్చిన రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారే కావాలంటే లిస్టు కూడా పంపుతామన్నారు. బిజెపి అంటేనే అమ్మకం…టిఆర్‌ఎస్ అంటే నమ్మకమన్నారు. దేశంలో అన్నిటిని బిజెపి ప్రభుత్వం అమ్మేస్తోందన్నారు. రాష్ట్రంలో బిహెచ్‌ఇఎల్ లాంటి సంస్థలకు రూ. 25వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తే కేంద్రం అంబాని ,అదానీ లకు దేశాన్ని అమ్మేస్తోందన్నారు. మోడీ కి ప్రజల పొట్ట తిప్పలు పట్టవు…ఫోటో తిప్పలే కావాలన్నారు. ప్యాకేజీల పేరుతో మోడీ ప్రజల చెవుల్లో క్యాబేజి లు పెడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అందరినీ మోడీ రోడ్ల మీద పడేశారని, ఇందుకు ఆయన రాజీనామా చేయాలి అని గంటలో 14 కోట్ల మంది నెటిజన్లు డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాల్కసుమన్ గుర్తు చేశారు.

గంగా ప్రక్షాళన మాట దేవుడెరుగు ఆ పవిత్ర నదిలో ప్రస్తుతం శవాలు ప్రవహిస్తున్నాయన్నారు. రైతులను వేధించేందుకు నల్ల చట్టాలు తెచ్చిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. అచ్చే దిన్ అంటూ మోడీ చచ్చేదిన్ తెచ్చారని ఆయన విమర్శించారు. బిజెపి అంటే బిల్డప్ ఎక్కువ… బిజినెస్‌కు తక్కువ అని అన్నారు. కిషన్‌రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి రైతుల ఆందోళనలను ఉక్కు పాదం తో అణిచేశారన్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా యాత్రల పేరిట కిషన్‌రెడ్డి ఫోజులు కొడుతున్నారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌కు ఐటిఐఆర్ ఎప్పుడు తెస్తావో కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్‌రెడ్డి తన భాష ,పద్ధతి మార్చుకోవాలన్నారు. హుజూరాబాద్‌కు దమ్ముంటే కిషన్ రెడ్డి రూ. 5 వేల కోట్ల ప్యాకేజి తేవాలన్నారు. దళిత బంధుకు దమ్ముంటే ఇంకో రూ. 40 లక్షలు అదనంగా ఇప్పించాలన్నారు. ఆర్ధిక నేరస్థులకు కమలం పార్టీ అడ్డాగా మారిందని బాల్కసుమన్ ఆరోపించారు. రాజేందర్‌లాంటి నేరస్థుడ్ని ఆ పార్టీలో చేర్చుకున్నారన్నారు. హుజూరాబాద్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది టిఆర్‌ఎస్ పార్టీయేనని అన్నారు. హుజురాబాద్‌లో ఈటెల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రూ.9 కోట్ల విలువైన కుంకుమ భరణిలు సిద్ధం చేశారని ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News