రూ.5,05,849 కోట్ల నుంచి రూ.9,80,407కోట్లకు పెరిగిన జిఎస్‌డిపి, 94శాతం వృద్ధి
దేశంలోనే మూడవ స్థానంలో తెలంగాణ
మీడియా సమామావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సోమవారం మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు రాష్ట్రం ఆరేళ్లలో సాధించిన ఆర్ధిక ప్రగతిని వివరించారు.రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జిఎస్‌డిపి రూ.5,05,849కోట్లు ఉండగా ,202021నాటికి ఇది రూ.9,80,407కోట్లకు పెరిగిందన్నారు. ప్రతిఏటా వృద్ధిని నమోదుచేస్తూ ఆరేళ్ల కాలంలో 94శాతం వృద్ధిని సాధించిందన్నారు.జిఎస్‌డిపి నమోదులో తెలంగాణ దేశంలోనే మూడవ స్థానంలో నిలిచిందన్నారు. దేశ జిడిపికి సహకారం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఆరవ స్థానంలో నిలిచిందన్నారు.దేశ జిఎస్‌డిపి ఆరేళ్లలో సాధించిన వృద్ధి శాతం 58.4శాతం మాత్రమే అని అన్నారు. దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ జిఎస్‌డిపిలో ప్రధమ స్థానంలో ఉందని తెలిపారు. జనాభా పరంగా , భౌగోళిక పరంగా తెలంగాణ కంటే పెద్దరాష్టాలకంటే అత్యధిక వృద్ధితో ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. 2014నుంచి ఏటా వృద్ధి రేటు పెరుగుతూనే వస్తోందన్నారు. జిడిపిలో జాతీయ వృద్ధితో పోలిస్తే తెలంగాణ 11.3శాతం సగటు వార్షిక వృద్ధిని సాధించిందన్నారు. ఆరేళ్ల కాలంలో 3.7శాతం అదనపు వృద్ధిరేటును సాధించామన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళికబద్ధంగా అవలంబించిన విధానల వల్లనే ఇంతటి విజయాలు సాధ్యపడ్డాయన్నారు. అదే జాతీయ వృద్ధిరేటు చూస్తే పోరుగున ఉన్న బంగ్లాదేశ్ కంటే ఇండియా ఆర్ధిక పరిస్థితి తక్కువగా ఉందన్నారు. ఇండియా జిఎస్‌డిపి 2.5శాతం వృద్ది ఉండగా , బంగ్లాదేశ్ 5.5శాతం అధికంగా ఉందన్నారు.202021 కోవిడ్ సమయంలో కూడా ఇండియా జిడిపి మైనస్ 3శాతంలో ఉండగా, తెలంగాణ జిడిపి 2.4 పాజిటివ్ గ్రోత్ నమోదు చేసిందన్నారు. తలసరి ఆదాయంలో కూడా రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందన్నారు. 202021లో రూ.2,37,632ఉండగా జాతీయ స్థాయి పర్‌క్యాపిటా ఇన్‌కం రూ.1,28,829 ఉందన్నారు. జాతీయ స్థాయి కంటే తెలంగాణ రాష్ట్రం 1.84శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. తలసరి ఆదాయంలో పదవ స్థానంలో ఉన్న తెలంగాణ మనకంటే 7రాష్టాలను దాటేసి 2021నాటికి మూడవ స్థానంలోకి చేరుకుందన్నారు.తలసరి ఆదాయంలో తెలంగాణ ఆరేళ్లలో 91.5శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు.
ఇప్పుడు దేశంలోనే రెండవ పెద్దరాష్ట్రంగా ఉన్నట్టు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న విధానాలు రాష్ట్ర సంపదను పెంచాయన్నారు. పారిశ్రామిక, ఐటి, వ్యవసాయం, వాటి అనుబంధ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు. తలసరి ఆదాయంలో సిక్కిం రూ. 4,24,549కోట్లతో ప్రధమ స్థానంలో ఉండగా, హర్యాన రూ.2,39,535తో ద్వితీయ స్థానంలో ఉండగా , రూ.2,37,632తో తెలంగాణ మూడవ స్థానంలో ఉందన్నారు. ఒక క్రమపద్దతిలో సుస్థితర అభివృద్ధిని సాధిస్తూ ,బిజేపి , కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకంటే ఎంతో ముందుకు పోయామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆరేళ్లలో 11.5శాతం వార్షిక సగటు వృద్ధిని సాధించిందని తెలిపారు. ఇదే సమయంలో ఇండియా 7శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. జాతీయ సగటు కంటే తెలంగాణ 4.6శాతం అధిక వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. మిషన్ కాకతీయ , మిషన్ భగీరధ, రైతుబంధు, ఉచిత విద్యుత్ , రైతుబీమా , గొర్రెల పంపిణీ, పాడి పశువుల పంపిణీ తదితర పథకాల అమలు ద్వారా ఇంతటి విజయాలను సాధించగలిగామన్నారు.
పన్నుల వసూళ్లలో ప్రధమ స్థానం మనదే:
రాష్ట్రంలో పన్నుల వసూళ్లలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం సోంత రాబడులను పెంచుకోవటంలో 90శాతం వృద్దిని నమోదు చేసిందన్నారు. 2014లో 35,146కోట్లనుంచి 2021నాటికి 66,648కోట్లకు రాబడులను పెంచుకోగలిగామని తెలిపారు. వార్షిక ఆదాయ వృద్ధిరేటు ఆరేళ్లలో 11.52శాతం నమోదు చేసినట్టు తెలిపారు. రెండవ స్థానంలో ఒడిశా 9.74శాతంతో ఎంతో దూరంలో నిలిచిందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి ఉత్పత్తులు పెంచామని తెలిపారు. సెక్టార్ల పరంగా కూడా ఎంతో ప్రగతిని సాధించామన్నారు. ప్రైమరి సెక్టారుగా ఉన్న వ్యవసాయం, పశుగణం, మత్సరంగం , మైనింగ్ రంగాల్లో రాష్ట్రం జిఎస్‌విఏ 2014లో 19.5శాతం ఉండగా, ఆరేళ్ల కాలంలో 24.1శాతం వృద్ధిని రికార్డు చేశామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రం 14.3శాతం వృద్ధిని సాధించగా ,దేశం 3.6శాతం వృద్దిలో ఉందన్నారు. రాష్ట్రం జాతీయ స్థాయికంటే 4.5రెట్లు అధికంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిర్ అనుసరిస్తున్న విధానాలే ఇంతటి ప్రగతికి కారణ అని వెల్లడించారు.
సెకండరి సెక్టార్‌లో కూడా ఉత్పత్తి, నిర్మాణం, విద్యుత్ ,గ్యాస్ నీటిసరఫరా తదితర రంగాల్లో 72శాతం వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపారు. టెరిటరి సెక్టార్‌లో ట్రేడ్ , రిపేర్స్, హోటల్స్ , రెస్టారెంట్స్ , రియల్‌ఎస్టేట్, తదతర రంగాల్లో 59.5శాతం వృద్ధిని సాధించినట్టు తెలిపారు. ఐటి రంగంలో 120శాతం వృద్ధిని సాధించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 55శాతం జనాభా ప్రైమరి సెక్టార్‌పైనే ఆధారపడి ఉందన్నారు. ఈ రంగంలో ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాలు , సంక్షేమ కార్యక్రమాలు , రాయితీలు ప్రోత్సాహకాల వల్లనే వ్యవసాయంలో 16.5శాతం వృద్ధిని సాధించగలిగామన్నారు.2014లో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన పంటల విలువ రూ.41706కోట్లు కాగా , 2021నాటికి ఇది రూ.80574కోట్లకు పెరిగిందన్నారు. పశుగణాభివృద్ధిలో రూ.29282కోట్లనుంచి ఆరేళ్లలో రూ.92211కోట్లకు పెరిగిందన్నారు. ఆక్వారంగంలో రూ.5250కోట్లుకు చేరామని తెలిపారు. రాష్ట్రంలో వరి , పత్తి, కంది ప్రధాన పంటలు అని తెలిపారు. 2014లో వరి పంట ఉత్పత్తి విలువ రూ.9528కోట్లుకాగా ఆరేళ్లలో ఇది రూ.47440కోట్లకు పెరిగిందన్నారు. పత్తిలో రూ.7549కోట్లనుంచి రూ.19025కోట్లకు , కందిలో రూ.530కోట్లనుంచి రూ.3808కోట్లకు ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. పారిశ్రామిక రంగంలో రూ.104365కోట్లనుంచి ఆరేళ్లలో రూ.179,885కోట్లకు వృద్ధిని పెంచామన్నారు.
తలసరి విద్యుత్‌లో మనమే టాప్ :
ఏ దేశమైనా , ఏ రాష్ట్ర మైనా అభివృద్ధిని సాధించిందని చెప్పేందుకు కొన్ని కొలమానాలు ఉంటాయన్నారు. అందులో విద్యుత్ వినియోగం కూడా కీలకం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 9నెలల్లోనే విద్యుత్ రంగంలో ఎంతో ప్రగతిని సాధించినట్లు తెలిపారు. తలసరి విద్యుత్ వినియోగంలో 201920లో 2071యూనిట్లతో 5వ స్థానంలో నిలిచామన్నారు. దేశ సగటు వినియోగం 1208యూనిట్లు ఉందన్నారు. రాష్ట్రంలో అధికారికంగా 25లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా , అనధికారికంగా వీటిసంఖ్య 30లక్షల వరకూ ఉందన్నారు. సేవారంగంలో కూడా 2014లో రూ.2,86,011కోట్లనుంచి ఆరేళ్లలో రూ.5,32,211కోట్లకు చేరుకున్నామన్నారు. ఐటి రంగంలో 2014లో రూ.66,276కోట్ల నుంచి ఆరేళ్లలో రూ.1,45,522కోట్లకు చేరినట్టు తెలిపారు. 120శాతం అభివృద్ధిని నమోదు చేశామన్నారు. ఐటి ఉద్యోగావకాశాల్లో కూడా 2014లో 3.71లక్షల నుంచి ఆరేళ్లలో 6.28లక్షలకు ఉద్యోగుల సంఖ్య పెరిగిందని తెలిపారు
పరిమితికి లోబడే అప్పులు :
రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు.కేంద్రం రాష్ట్రాలకు 25శాతం పరిమితి విధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం 22.83శాతంతో ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడే అప్పులు చేసిందన్నారు. ప్రధాని మోడి సొంతరాష్ట్రం గుజరాత్ 38.67శాతంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పులను కూడా ఉత్పాదక రంగంలో పెట్టి సద్వినియోగం చేసిందన్నారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం సాధించిన ప్రగతి ఇదేనా:
కేంద్రంలో బిజేపి ప్రభుత్వం ఆరేళ్లకాలంలో పెట్రోల్ ధర రూ.72నుంచి 105కు పెంచింది. డిజిల్ రూ.57నుంచి 97కు పెంచింది. గ్యాస్ సిలిండర్ రూ.450నుంచి 950కి పెంచింది. సిలిండర్‌పై సబ్సిడి నగదును రూ.250నుంచి రూ.40కి తగ్గించింది. ప్రధాని నరేంద్రమోడి ప్రభుత్వం కేంద్రంలో సాధించిన ప్రగతి ఇదేనా అని మంత్రి హరీష్ రావు కేంద్రంపై నిప్పులు చెరిగారు. రోడ్లు , రైల్వేస్టేషన్లు, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్ వంటి వాటిని అమ్మకంలో కేంద్రం వృద్ధిని సాధించిందన్నారు. కేంద్ర ప్రభత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టేందుకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖనే పెట్టిందన్నారు. సెస్ రూపంలో లీటర్ పెట్రోల్‌పైన రూ.16 ప్రజలపై భారం మోపిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రపభుత్వంపైన విమర్శలు చేయటంలో ఒకరిపై మరొకరు పైచేయిని సాధించేందుకు పోటీలు పడుతున్నారే తప్ప రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తేవటాన్ని గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ,బిజేపి పార్టీలు రెండవ స్థానం కోసం పోటీలు పడుతున్నాయన్నారు. కెసిఆర్ , టిఆర్‌ఎస్‌పార్టీ ఎప్పటికీ ప్రధమ స్థానమే అన్నారు.
పల్లె ప్రగతిపై ఛాలెంజ్ :
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇంతటి ప్రగతి జరిగిందా ,చూపగలరా అని మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ , బిజేపి నేతలకు ఛాలెంజ్ విసిరారు. బిజెపి 18రాష్ట్రాల్లో , కాంగ్రెస్ 5రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయని ఈ రాష్ట్రాల్లో 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అద్భతమైన ప్రగతి సాధించామన్నారు. ప్రతిపక్షాలకు ఇప్పుడు సమస్యలే దొరకటం లేదన్నారు. నిరాధార ఆరోపణలు , అర్ధం లేని విమర్శలతో ప్రజల్లో పలుచన కావద్దన్నారు. ప్రతిపక్షాల విమర్శలు రాష్ట్ర గౌరవం , స్థాయిని తగ్గించేవిధంగా ఉండరాదని మంత్రి హరీష్ రావు హితవు పలికారు.
దళితబంధుకు నిధులు ఉన్నాయి:
రాష్ట్రంలో దళితబంధు పథకం అమలుకు నిధులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం నిరర్ధక ఆస్తులు అమ్మి ఉత్పాదక రంగంపై ఖర్చుపెడితే తప్పేముందన్నారు. దళితబందు పథకం ద్వారా ఆ కుంటుంబాలు చేసే ఉత్పత్తులు రాష్ట్ర సంపదలో భాగం అవుతాయన్నారు. దీన్ని రాష్ట్ర అభివృద్ధిలో భాగంగానే చూడాలన్నారు.
ఉద్యోగఖాళీలపై త్వరలో నివేదిక:
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై త్వరలోనే నివేదిక సిద్దమవుతుందన్నారు. కొత్తజిల్లాలు , కొత్త జోన్‌ల వల్ల కొంత జాప్యం ఏర్పడిందన్నారు. కొత్తజిల్లాల ద్వారా పాలనను వికేంద్రీకరించామన్నారు. ధరణి ద్వారా భూముల సమస్యలు 95శాతం తగ్గాయన్నారు.
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాం:
కేంద్రప్రభత్వం చేస్తున్ననూతన వ్యవసాయ చట్టాలను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వ్యతిరేకించిందన్నారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామన్నారు. విద్యుత్ చట్టాలను కూడా వ్యతిరేకించామని తెలిపారు. రైతుల జీవితాలు బాగుపడటమే తెలంగాణ ప్రభుత్వ లక్షం అన్నారు. వివిధ పథకాల అమలు ద్వారా సాగుపై రైతుల్లో భరోసా పెంచామననారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రం కూడా పార్లమెంట్‌లో వెల్లడించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.