Tuesday, November 5, 2024

హుజూరాబాద్ ఉప ఎన్నిక మాకు చిన్నదే

- Advertisement -
- Advertisement -

Huzurabad by-election is small for us Says KTR

 ప్రజల ఆశీస్సులు మా పార్టీకే ఉంటాయి
మిగతా ఉప ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికను చూస్తాం
సెప్టెంబర్‌లో అన్ని కమిటీలు పూర్తి చేస్తాం
దసరా నాటికి పార్టీ ఆఫీసులను ప్రారంభించుకుంటాం : మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కొంతమంది హుజూరాబాద్ ఉప ఎన్నికకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, మాకు మాత్రం ఈ ఎన్నిక చిన్నదేనని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం టిఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన విషయాలను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో అసలు హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశంపై చర్చే జరగలేదన్నారు. సహజంగా ప్రజల ఆశీస్సులు తమ పార్టీకే ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత హుజురాబాద్ ఎన్నిక గురించి చర్చ జరుపుతామన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను మిగతా ఉపఎన్నికలను చూసినట్టుగానే చూస్తామన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొన్నామని, 2018 నుంచి ఇప్పటివరకు జనరల్ ఎన్నికలు మొదలుకొని పార్లమెంట్, మున్సిపల్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల్లో ఏకపక్షంగా ఫలితాలను ప్రజలు ఇచ్చారని, ఎల్లప్పుడూ టిఆర్‌ఎస్‌ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

2న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన

సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీలో వివిధ అంశాలకు సంబంధించి సమగ్ర చర్చ జరిగిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు సిఎం కెసిఆర్ చేతులమీదుగా భూమి పూజా కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఢిల్లీలో తమ పార్టీ ఎలా ఉంటుందన్న విషయం తెలుస్తుందని ఆయన తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి చట్ట సభల్లోని టిఆర్‌ఎస్ ప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఆహ్వానితులుగా ఉంటారన్నారు. సెప్టెంబర్ 2వ తేదీనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కమిటీలు,- వార్డు కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. మండల- మున్సిపల్- పట్టణ-, జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్ మాసంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే కొత్త జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారన్నారు.

అక్టోబర్ లేదా నవంబర్‌లో టిఆర్‌ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలు

దళితబంధుపై ప్రజలను చైతన్యం చేయాలని, దళితబంధును ఉద్యమంలా పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ సూచించారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. వచ్చే 20 ఏళ్లు టిఆర్‌ఎస్సే పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. బిసి బంధుతో సహా అన్ని ఇస్తామని, దశల వారీగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. కొత్తగా జిల్లా అధ్యక్షులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సిఎం కెసిఆర్ అక్టోబర్‌లో దసరా నాటికి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. రెండు జిల్లాల్లో (హైదరాబాద్, వరంగల్ జిల్లాలను) మినహాయిస్తే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ పార్టీ రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ సంస్థగా ప్రారంభమై నేడు తిరుగులేని రాజకీయశక్తిగా అవతరించిందన్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ లేదా నవంబర్‌లో టిఆర్‌ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. త్వరలోనే దానికి సంబంధించిన తేదీలను కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రస్థాయి కూర్పు తరువాతే టిఆర్‌ఎస్ ప్లీనరీ నవంబర్ మొదటివారంలో నిర్వహించనున్నట్టు కెటిఆర్ తెలిపారు.

ప్రతిపక్షాలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి

పనికిమాలిన ప్రతిపక్షాలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయన్నారు. వారి విమర్శలను పట్టించుకోనని ఆయన పేర్కొన్నారు. జాతీయపార్టీలైన బిజెపి పార్టీ సుమారు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అక్కడ దళితబంధు లాంటి కార్యక్రమాన్ని ఆయా రాష్ట్రాలు చేపట్టాలని ఆయన సూచించారు. చిత్రం ఏమిటంటే 75 ఏళ్లలో ప్రభుత్వాలు వాళ్ల చేతుల్లో ఉన్నప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థులు, కరెంట్ ఇవ్వలేని దద్ధమ్మలు పేదల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావాలన్న ఆలోచన చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. సమాజంలో బాటమ్ ఆఫ్ ది పిరమిడ్‌లో అట్టడుగున ఉన్న దళితజాతిని పైకి తీసుకువచ్చేందుకే దళితబంధును సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారన్నారు. తమ పాలసీ ప్రకారమే తాము ముందుకు సాగుతున్నట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు.

సిద్దిపేటలో దళితజ్యోతి ప్రారంభించిన కెసిఆర్ అదే స్ఫూర్తి తో దళితబంధు పథకం తీసుకొచ్చారన్నారు. కొంతమంది దళితబంధు విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని, ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టిన దళితబంధు పథకం అమల్లో పాల్గొనాలన్నారు. కెసిఆర్‌ది బలహీనమైన గుండె కాదనీ, ధైర్యంతోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్టే ‘దళితబంధు పథకం’ తీసుకొచ్చారన్నారు. దళితబంధుపథకాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేయాలని సిఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎప్పుడు ఏ పథకం అమలు చేయాలో ప్రభుత్వానికి తెలుసని, హుజురాబాద్ ఎన్నిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేది లేదని, కేంద్రంలో ప్రభుత్వం మారేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌లో దళితబంధు సక్సెస్ అయితే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తదన్నారు. హుజురాబాద్ టిఆర్‌ఎస్ పార్టీకి కంచుకోట అని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News