కాంగ్రెస్ ఎంపి ప్రణీత్ కౌర్ ఆరోపణ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్థానంలో వేరొకరిని నియమించాలని కోరుతున్న కాంగ్రెస్‌లోని అసమ్మతివాదులపై కాంగ్రెస్ ఎంపి ప్రణీత్ కౌర్ తీవ్ర ఆగ్రహం ప్రకటించారు. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి ఏర్పడడానికి పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూయే కారణమని ఆయన ఆరోపించారు. 2022లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని మార్చాలంటూ పార్టీ నాయకులు కొందరు తిరుగుబాటు చేయడాన్ని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సతీమణి అయిన ప్రణీత్ కౌర్ తప్పుపట్టారు. ఈ చర్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని ఆమె తెలిపారు. పంజాబ్‌లో పార్టీకి అనేక విజయాలను సాధించిపెట్టిన ఘనత అమరీందర్ సింగ్‌కు దక్కుతుందని, పంజాబ్‌ను ప్రగతి బాట పట్టించింది కూడా ఆయనేనని ఆమె ప్రశంసించారు. రానున్న ఎన్నికలలో పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడానికి నాయకులంతా సానుకూల పాత్ర పోషించాలని ఆమె పిలుపునిచ్చారు.