చెలరేగిన అండర్సన్,రాబిన్సన్, టీమిండియా 78 ఆలౌట్, మూడో టెస్టులో ఇంగ్లండ్ హవా
లీడ్స్: భారత్‌తో బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్ మొదటి రోజే మ్యాచ్‌పై పట్టు బిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు సమష్టిగా రాణించిన టీమిండియాను వందలోపే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ తాజా సమాచారం లభించే సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. ఇక లార్డ్‌లో జరిగిన రెండో టెస్టులో అసాధారణ ఆటతో చెలరేగి పోయిన టీమిండియా మూడో మ్యాచ్‌లో మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచింది. జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. దీన్ని బట్టి భారత బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో ఊహించుకోవచ్చు.
ఆరంభం నుంచే..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. జేమ్స్ అండర్సన్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. అతని ధాటికి ఓపెనర్ లోకేశ్ రాహుల్ (0), చటేశ్వర్ పుజారా (1), కెప్టెన్ విరాట్ కోహ్లి (7) పెవిలియన్ చేరారు. ఇక వైస్ కెప్టెన్ అజింక్య రహానె (18), ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రమే డబుల్ డిజిట్ స్కోరును అందుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రోహిత్ 105 బంతుల్లో 19 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రహానె 54 బంతుల్లో మూడు ఫోర్లతో 18 పరుగులు చేశాడు. ఇక ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు లభించాయి. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, క్రెగ్ ఓవర్టన్ మూడేసి వికెట్లు పడగొట్టగా, శామ్ కరన్, రాబిన్సన్లకు రెండేసి వికెట్లు లభించాయి.