మనతెలంగాణ/ఓదెల: నీటి అలలపై వెల్లకిలా పడుకుంటాడు..నీళ్ళలోనే ఆసనాలు వేస్తాడు..యోగా ముద్రలో తేలియాడు తుంటాడు.. ఇలా తనదైన శైలిలో విన్యాసాలు చేస్తూ పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కొలనూరుకు చెందిన దండంరాజు రామచందర్‌రావు పలువురిని ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే హిందు మహాసముద్రం, కాళేశ్వరం జలాల్లో విన్యాసాలు చేసి ఔరా అనిపించాడు. పెద్దపల్లి జిల్లాలోని ఓదేల మండలం కొలనూర్‌లో పెద్ద విస్తీర్ణంలో ఉన్న ఊర చెరువులో ఎండకాలం వచ్చిందంటే చాలు పిల్లలంతా చేరి ఈతలు కొట్టేవారు. రాంచందర్‌రావు కూడా చిన్నతనంలో ఈతలో ఆసక్తి చూపాడు. తండ్రి సోదరుల ప్రొత్సాహంతో స్నేహితుడు యాంసాని రాజమౌళితో కలిసి అనేక రకాల విన్యాసాలను నేర్చుకున్నాడు.
మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి బంధువుల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి చెరువు మధ్యలోకి వెళ్ళి నీటిపై పడుకొని ఉండడాన్ని చూసి దండంరాజు రాంచందర్‌రావు అబ్బురపడ్డా. అతడి స్ఫూర్తితో నీటిలో పడుకునే విన్యాసాన్ని దండం రాజు రాంచందర్‌రావు సాధన చేశాడు. ఉద్యోగ రీత్యా సింగరేణిలో పనిచేస్తున్నప్పుడు గోదావరిఖని సింగరేణి ఈత కొలనులో కూడా అనేక రకాల విన్యాసాలను ఆయ న ప్రాక్టీస్ చేశారు. 2012లో కాళేశ్వరం వెళ్లి అక్కడ పారుతున్న గోదావరిలో నీటిపై పడుకుని తేలుతూ దండం రాజు రాంచందర్‌రావు విన్యాసం చేశాడు. అలాగే 2019 డిసెంబర్‌లో ఆయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని కన్యాకుమారి వెళ్ళి అక్కడి హిందూ మహాసముద్రం అలలపైనా విన్యాసాలు ప్రదర్శించాడు. ప్రసుత్తం ఉద్యోగ విరమణ పొంది హైద్రాబాద్‌లో స్థిరపడ్డాడు. స్వగ్రామం కొలనూర్ అంటే ఇంతో ఇష్టమని, చిన్న నాటి జ్ఞాపకాలు ఇప్పుడు మదిలో మేదులుతూనే ఉంటాయని దండం రాజు రాంచందర్‌రావు గుర్తు చేసుకుంటున్నాడు.
Peddapalli Man performs yoga Asanas on water