2023 వరకు కొత్త కమిటీ
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాంతో మరింత ముందుకు వెళతాం
క్రెడాయ్ తెలంగాణ సభ్యులు
మనతెలంగాణ/హైదరాబాద్: కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్ తెలంగాణ) నూతన కమిటీ ఎన్నికయ్యింది. కొత్తగా ఎన్నుకోబడిన ఆఫీస్ బేరర్లతో పాటు క్రెడాయ్ తెలంగాణ యూత్ వింగ్ కమిటీ వివరాలను క్రెడాయ్ తెలంగాణ సభ్యులు వెల్లడించారు. 2021 నుంచి 2023 సంవత్సరం వరకు ఈ కొత్త కమిటీ పదవిలో ఉంటుంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి క్రెడాయ్ చేస్తున్న కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటుగా ఈ రంగం అభివృద్ధికి వీరు బాధ్యత వహించనున్నారు.
నూతన కమిటీ వివరాలు ఇలా….
క్రెడాయ్ తెలంగాణా చైర్మన్‌గా సిహెచ్ రామ్‌చంద్రారెడ్డి, ప్రెసిడెంట్‌గా డి.మురళీకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ -ఎలక్ట్‌గా ఈ.ప్రేమ్‌సాగర్ రెడ్డి, సెక్రటరీగా కె.ఇంద్రసేనా రెడ్డి, ఉపాధ్యక్షుడి జి.అజయ్‌కుమార్, జగన్ మోహన్ చిన్నాల, వి.మధుసూదన్‌రెడ్డి, బి.పాండురంగారెడ్డి, జాయింట్ సెక్రటరీగా జి. శ్రీనివాస్ గౌడ్, ట్రెజరర్‌గా ఎం.ప్రశాంత రావులు ఎన్నికయ్యారు. క్రెడాయ్ యూత్ వింగ్ తెలంగాణ కో ఆర్డినేటర్‌గా సి.సంకీర్త్ ఆదిత్య రెడ్డి, సెక్రటరీగా రోహిత్ అశ్రిత్ ఎన్నికయ్యారు.
నూతన ఛాప్టర్లను బలోపేతం చేయడం
ఈ కొత్త టీం క్రెడాయ్ తెలంగాణ కార్యక్రమాలను విస్తరించడంతో పాటుగా బిల్డర్ల ఐక్యతను ప్రోత్సహించడంపై దృష్టి సారించడంతో పాటు క్రెడాయ్ తెలంగాణ నూతన ఛాప్టర్లను బలోపేతం చేయడం, వినియోగదారుల సంతృప్తిని మెరుగుపరచడం లాంటి లక్ష్యాలను ఈ సంవత్సరం కీలక లక్ష్యాలుగా నిర్ధేశించుకుంది. వినియోగదారుల సంతృప్తిపరచడంతో పాటు నైపుణ్యాభివృద్ధి సభ్యులకు శిక్షణ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వడం, నిర్మాణ రంగ కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, నీటి పొదుపు, హరితహారం, తమ సభ్యులకు గ్రీన్‌బిల్డింగ్ నేపథ్య స్వీకరణపై అవగాహన కల్పించడం ద్వారా అసాధారణ తోడ్పాటును క్రెడాయ్ తెలంగాణ అందించనుందని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకొస్తున్న చురుకైన పాలసీలతో….
ఈ సందర్భంగా సిహెచ్ రామచంద్రా రెడ్డి, -తెలంగాణ క్రెడాయ్ చైర్మన్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన చురుకైన పాలసీలు కారణంగా రాష్ట్రం వృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. వీటిలో పరిశ్రమలకు అనుమతుల కోసం సింగిల్ విండో విధానం టిఎస్ ఐపాస్, ఎస్సీ, ఎస్టీ వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తూ టి-ప్రైడ్, పారిశ్రామిక వ్యవస్థాపకత అభివృద్ధి కోసం టి ఐడియా వంటివి ఈ అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతున్నాయన్నారు. జిల్లాలకు సైతం పారిశ్రామికాభివృద్ధిని విస్తరిస్తూ రూపొందించిన పాలసీలు మరింతగా వృద్ధిని వేగవంతం చేస్తూనే, రాష్ట్రంలో జిల్లాల అభివృద్ధిని సైతం మెరుగుపరిచిందన్నారు.
జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి పథంలో….
నూతన కార్యవర్గ ఎజెండా గురించి డి.మురళీ కృష్ణా రెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్ తెలంగాణ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి కారణంగా పలు సవాళ్లు ఎదురైనప్పటికీ రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటుగా పలు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం పరిచయం చేసిన నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలు, సమగ్రమైన పారిశ్రామిక విధానం వంటివి దీనికి దోహద పడుతున్నాయన్నారు.
సమగ్ర పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తూ…..
ఈ.ప్రేమ్‌సాగర్ రెడ్డి, ప్రెసిడెంట్, -ఎలక్ట్, క్రెడాయ్ తెలంగాణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా సమగ్ర పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తూ 2018-, 19లో తెలంగాణా స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టిఎస్‌ఐసీ) స్టార్టస్ ఇండియా తెలంగాణ యాత్రను ప్రారంభించింద న్నారు. టియర్ 2, 3 నగరాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించే ప్రయత్నంలో ఈ కార్యక్రమం ఆరంభించిందన్నారు.. ఈ కార్యక్రమాలన్నీ కూడా టియర్ 2, టియర్ 3 నగరాల్లో పారిశ్రామిక వృద్ధికి అత్యంత కీలకంగా మారాయన్నారు. అదే రీతిలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్‌ను వృద్ధి చేశాయన్నారు.
ఒన్ డిస్ట్రిక్ట్, ఒన్ ప్రొడక్ట్’ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నం
కె.ఇంద్రసేనా రెడ్డి, సెక్రటరీ, క్రెడాయ్ తెలంగాణా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడు పలు పరిశ్రమలైన టెక్స్‌టైల్స్, ఆటో అనుబంధ సంస్థలు, ఫార్మా, హెల్త్‌కేర్, ఐటి, ఐటిఈఎస్, ఏవియేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన వాటిలో పెట్టుబడులను రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ‘ఒన్ డిస్ట్రిక్ట్, ఒన్ ప్రొడక్ట్’ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అత్యధిక మార్కెట్ సామర్థ్యంను అటు ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతులకు ప్రత్యామ్నాయంగా నిలిచే ఉత్పత్తులు గుర్తించి, ప్రోత్సహించడం , పారిశ్రామిక జోన్ల అభివృద్ధికి భరోసా అందించడం, జిల్లాలకు ప్రయోజనం కలిగించడం, మౌలిక వసతులు, ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి , ఉపాధి అవకాశాల కల్పన వంటివి వీటిలో ఉన్నాయన్నారు. ఈ ఫలితంగానే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమకు డిమాండ్ పెరిగిందన్నారు.