మల్లన్నసాగర్ జలాశయాన్ని హెలికాప్టర్ నుంచి
వీక్షించిన ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. కరీంనగర్ పర్యటన నుంచి హైదరాబాద్ వస్తున్న సందర్భంలో హెలికాప్టర్ నుంచి మల్లన్నసాగర్‌ను సిఎం వీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ ప్రాజెక్టును సిఎం కెసిఆర్ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. 50 టిఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మాణమైంది. నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో ఈ ఏడాది జలాశయాన్ని కాళేశ్వరం జలాలతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా నీటిని జలాశయంలోనికి పంపుతున్నారు. ఆ దృశ్యాన్ని విహంగవీక్షణం ద్వారా చూసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆనందం వ్యక్తం చేశారు. నెర్రవారిన భూతల్లి గుండెలపై జలసిరులు నాట్యమాడుతున్న దృశ్యాన్ని చూసిన సిఎం కెసిఆర్ హృదయం పులకరించిపోయింది. గలగలమంటూ గోదారి నీళ్లు మల్లన్న పాదాలను తాకుతున్న దృశ్యాలను ఆకాశమార్గం నుంచి చూసిన సిఎం అమితానంద భరితుడయ్యారు.