ఐసిస్ ఉగ్రవాదులను హతమార్చాల్సిందిగా ఆర్మీకి బైడెన్ ఆదేశం
అగ్రరాజ్యాధినేత మొహంలో దిగులు, మాటల్లో తడబాటు
ఉద్వేగంతో కొది సేపు మౌనంగా ఉండిపోయిన అధ్యక్షుడు
వాషింగ్టన్: అఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో జరిగిన పేలుళ్లపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల్లో అమెరికాసైనికుల మృతిపట్ల ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని, వెంటాడి వేటాడి మట్టుబెట్టి తీరుతామని ప్రకటించారు. మృతి చెందిన సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి ఇప్పటికే ఐసిస్ ఖోరసాన్‌గ్రూపు బాధ్యత ప్రకటించుకున్నందున ఆ ఉగ్రవాద సంస్థ నేతలను మట్టుబెట్టాల్సిందిగా తమ దేశ ఆర్మీని బైడెన్ ఆదేశించారు. గురువారం వైట్‌హౌస్ ప్రెస్‌మీట్‌లో బైడెన్ ముఖంలో దిగులు, మాటల్లో తడబాటు కనిపించింది. అఫ్ఘన్‌నుంచి హటాత్తుగా సేనల్ని తరలించి విమర్శలు ఎదుర్కొంటున్న బైడెన్‌కు కాబూల్ ఉగ్రదాడితో గట్టి షాక్ తగిలింది. ఈ ఘటనపై విలేఖరులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మొహంలో అదే ప్రతిబింబించింది. విలేఖరులు ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో ఆయన కొద్ది సేపు మౌనంగా ఉండిపోవడం గమనార్హం.
‘ బాధ్యులెవరైనా క్షమించేది లేదు. వాళ్లెవరైనా తగిన మూల్యం చెల్లించుకోవలసిందే. ఈ దాడిని అంత తేలిగ్గా మరిచి పోము. ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి, వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం. ఐసిసి నాయకుల ఏరివేత మొదలైనట్లే’ అంటూ ఉద్రేకపూరితంగా మాట్లాడారు. అఫ్ఘన్ గడ్డపై అమెరికా సైనికుల సేవలను జ్ఞప్తి చేసుకున్న ఆయన మరణించిన వారికి సంఘీభావంగా కొద్ది సేపు మౌనంగా ఉండిపోయారు. జరిగిన నష్టానికి తనదే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్ .. సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమన్నారు. ఆగస్టు 31 గడులోగా బలగాల తరలింపు పూర్తి చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. సైనికుల మృతికి సంతాపంగా దేశవ్యాప్తంగా అమెరికా పతాకాన్ని అవనతం చేయాలని ఆయన ఆదేశించారు.
2011 తర్వాత ఇదే పెద్ద దాడి
కాబూల్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో 13 మంది అమెరికా సైనికులు మృతి చెందారు. 2011 తర్వాత ఈ స్థాయిలో అమెరికన్లు మరణించడం ఇదే మొదటి సారి. రెండు దశాబ్దాల పాటు జరిగిన అఫ్ఘన్ యుద్ధంలో 1909 మంది అమెరికన్లు మరణించారు. 2011 ఆగస్టు 6 వ తేదీన ఉగ్రవాద శిబిరంపై అమెరికా చినూక్ హెలికాప్టర్ దాడికి దిగింది. ఈ సమయంలో ఉగ్రవాదులు హెలికాప్టర్‌ను కూల్చేశారు. ఈ ఘటన వార్దక్ ప్రావిన్స్‌లో జరిగింది. ఈ దాడిలో 22 మంది నేవీ సీల్స్ సహా 30 మంది అమెరికా సిబ్బంది మృతి చెందారు. ఓ అమెరికా జాగిలం, మరో 8 మంది అఫ్ఘన్ పౌరులు, కూడా చనిపోయారు.