ఆదుకున్న రోహిత్, పుజారా
రాణించిన కోహ్లి, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 215/2
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. 354 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా అండగా నిలిచారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య ఇంగ్లండ్ 432 పరుగుల భారీ స్కోరును సాధించింది. శుక్రవారం మూడో రోజు ఆరంభంలోనే ఇంగ్లండ్ మిగిలిన రెండు వికెట్లను కోల్పోయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం లభించింది. కెప్టెన్ జో రూట్ (121) మరోసారి శతకంతో కదం తొక్కాడు.
రూట్ అసాధారణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం సాధించడంలో కీలక పాత పోషించాడు. ఇక ఓపెనర్లు రోరి బర్న్ (61), హసీబ్ హమీద్ (68) అర్ధ సెంచరీలతో రాణించారు. మరోవైపు డేవిడ్ మలాన్ (70) కూడా తనవంతు పాత్ర పోషించాడు. ఇలా టాప్ ఆర్డర్లో నలుగురు రాణించడంతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును సాధించింది. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమి అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు బుమ్రా, సిరాజ్, జడేజాలు రెండేసి వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.
సమన్వయంతో ఆడుతూ..
ఇక 354 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కెఎల్.రాహుల్ వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన రాహుల్ 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే తర్వాత వచ్చిన మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ చటేశ్వర్ పుజారాతో కలిసి మరో ఓపెనర్ రోహిత్ పోరాటం కొనసాగించాడు. ఇటు రోహిత్, అటు పుజారా సంయమనంతో ఆడుతూ భారత్‌ను ఆదుకున్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో ఒత్తిడి దరిచేరకుండా చూసుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించక తప్పలేదు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 156 బంతుల్లో ఒక సిక్స్, మరో ఏడు ఫోర్లతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో పుజారాతో కలిసి 82 పరుగుల కీలకమైన రెండో వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ ఔటైనా పుజారా తన పోరాటం కొనసాగించాడు. అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లి అండగా నిలిచాడు. శుక్రవారం మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్ 80 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. చటేశ్వర్ పుజారా (91), కోహ్లి (45) పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దాటాలంటే భారత్ మరో 139 పరుగులు చేయాలి.