Tuesday, November 5, 2024

పేదల ఆత్మగౌరవ సౌధాలు

- Advertisement -
- Advertisement -

KTR launches 288 double bedroom houses

రూ.9,700 కోట్ల వ్యయంతో గ్రేటర్‌లో పేదలకు లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్న ఘనత మాదే

రాష్ట్రంలోని పేదలకు రూ.18వేల కోట్లతో నాణ్యమైన ‘డబుల్’ ఇళ్లను ఇస్తున్నాం కొద్ది
పాటి పనులు మినహా అన్నింటి నిర్మాణామూ పూర్తి అయ్యింది ఉత్తమ ప్రమాణాల
విషయంలో రాజీ ప్రసక్తే లేదు పిల్లి గుడిసెల స్థానంలో నిర్మించిన ఇళ్లలో ప్రముఖ
కంపెనీ లిఫ్ట్‌లను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం పాతబస్తీ
సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది నగరం నాలుగు దిక్కుల నాలుగు
మల్టీసెషాలిటీ ఆసుపత్రులకు ప్రారంభించాం చంచల్‌గూడ
సమీపంలోని పిల్లి గుడిసెల స్థానంలో నిర్మించిన
288 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : నిరుపేదలందరూ ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్ష అని, పురపాలక శాఖమంత్రి కె.తారక రామారావు అన్నారు. రూ.9700 కోట్ల వ్యయంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి పేదలకు పూర్తిగా ఉచితంగా ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. పేదలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించేందుకైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. శనివారం చంచల్‌గూడ సమీపంలో పిల్లిగుడిసెల స్థానంలో రూ.24.91 కోట్ల వ్యయంతో నిర్మించిన 288డబుల్ బెడ్‌రూం ఇళ్లను కెటిఆర్ ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌నరెడ్డి, ఎమ్మెల్సీ సయ్యద్ అమినూల్ జాఫ్రి, ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల కలిసి కెటిఆర్ లబ్ధిదారులకు లాటరీ పద్ధ్దతిలో ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ గ్రేటర్‌లో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లలో మరో 70వేల ఇళ్ల నిర్మాణం పూరై లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

మిగిలిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొద్ది పాటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని నిరుపేదల కోసంరూ.18వేల కోట్ల వ్యయంతో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. డబుల్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాల అంశంలో ఏమాత్రం రాజీపడే ప్రసెక్తే లేదని, పిల్లి గుడిసెల స్థానంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో ప్రముఖ కంపెనీ చెందిన లిప్టులను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. మూసీ శుద్ధ్దీకరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న ఎస్‌టిపిలకుతోడుగా మరో 335 ఎస్‌టిపిలను నిర్మించనున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరమంటేనే చార్మినార్‌తో ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, పాతబస్తీ సర్వతోముఖాభివృద్దికి తమ ప్రభుత్వకృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. గ్రేటర్ వాసులతో పాటు చుట్టూపక్కన ఉన్న జిల్లాలవాసులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్షంగా నగరానికి నాలుగు దిక్కులా ఒక్కొకటి చొప్పున 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభించామని తెలిపారు.

ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి శిధిలావస్థకు చేరుకున్నందున ఆ స్థానంలో ఆధునాతన ఆసుపత్రిని నిర్మించాలన్న ఎంపి అసదుద్దీన్ విజ్ఞప్తిని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా చంచల్‌గూడా జైలును శివారు ప్రాంతాలకు తరలించి ఈ స్థలంలో విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రాలు, ఆసుపత్రిని నిర్మించాలన్న డిమాండ్‌ను సైతం సిఎంతో చర్చింనున్నట్లు వెల్లడించారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో సైతం నగర అభివృద్ది పనులను ముమ్మరంగా నడిచాయన్నారు. ఎంపి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ చంచల్‌గూడ జైలును అక్కడి నుంచి తరలించి విద్యాసంస్థలను నిర్మించాలని కోరారు.

పిల్లి గుడిసెవాసుల్లో వెల్లివిరిసిన ఆనందం

పిల్లి గుడిసెలవాసుల్లో ఆనందం వెల్లి విరిసింది. తాము గతంలో నివసించిన పూరి గుడిసెల స్థానంలో ప్రైవేట్ అపార్ట్‌మెంట్లకు దీటుగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాలను చూసిన హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఇళ్లను కట్టుకుంటామని గాని వీటిలో నివసిస్తామనిగాని తాము కలలో కూడా ఊహించకోలేదంటూ ఆశ్చర్య పోయ్యారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పూర్తిగా పండుగ వాతావరణ ఏర్పడింది. ఓ ఫ్లోర్‌ను చిన్నారితో రిబ్బన్ కట్ చేయి ప్రారంభించగా, మరో ప్లోర్‌కు మేయర్ గద్వాల్ విజయలక్ష్మిరిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పట్టాలతో పాటు ఇంటి తాళాలను అందుకున్న పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కరికి ఒక్కరూ మిఠాయిలు తినిపించకున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్‌తో లబ్ధ్దిదారుల కుటుంబ సభ్యలు సెల్పీలు దిగ్గారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ పేదల అభున్నతికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడబోదన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు విలువ చేసే డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తోందని తెలిపారు. అనంతరం డబుల్ బెడ్ ఇళ్ల సముదాయంలో మంత్రి కెటిఆర్, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మిలు మొక్కలు నాటారు.

ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌కు దీటైన ఇళ్లు : మేయర్ విజయలక్ష్మి

ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌కు దీటైన ఇంట్లో ఉండబోతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉంది. తమ ఆత్మగౌరవాన్ని మరింతి పెంపొందించే విధంగా ఈ ఇళ్లను నిర్మించిన ఇచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, వాటిని తమకు అందించిన మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు.

మా చివరి దశలో ఇది గొప్ప అనుభూతి : బి. గోపమ్మ, ఇ. మరియమ్మ, బీజాన్ బీ

మా జీవిత చివరి దశలో గొప్ప ఇళ్లల్లో నివశించబోవడం గొప్ప అనుభూతిని ఇవ్వనుంది. తాము జీవితాంతం ఎంతో కష్టపడ్డా తమకంటూ ఓ ఇళ్లు ను నిర్మించుకోలేక పోయ్యాం. మా కలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆయన కొడుకు మంత్రి కెటిఆర్ జీవితాంతం చల్లగా ఉండాలి.

చాలా సంతోషంగా ఉంది : రహెమత్ బీ

గత కొద్ది సంవత్సరాల నుంచి పిల్లి గుడిసెలో జీవనం సాగిస్తున్నాను. పూరి గుడిసెలో ఉండేదాన్ని. 2016లో సర్కార్ సర్‌లు వచ్చి మీకు ఇళ్లు కట్టిస్తామని చెబితే నమ్మలేదు. వారు పేపర్ మీద రాసి ఇచ్చారు. ఇక్కడ డబుల్ బెడ్ రూంలు కట్టి ఇస్తామని. నాకు ఇప్పుడు పెద్ద ఇల్లు వచ్చింది. అందులో రెండు డబుల్ బెడ్ రూంలు కిచెన్,బాత్‌రూంలు ఉన్నాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా చిన్ననాటి కల నెరవేరిందని ఆనందంగా చెప్పింది.

కెసిఆర్ సర్‌కు రుణపడి ఉంటాను : పాపమ్మ

నా వయస్సు 80 సంవత్సరాలు. నా జీవితంలో సొంత ఇంట్లో ఉంటానని అనుకోలేదు. అది కెసిఆర్ సర్ పుణ్యంతో నా కల నెరవేరింది. ఇల్లు చాలా బాగుంది. ఇక మా కుంటుంబ సభ్యులందరం ఒక దగ్గరనే ఉంటాము. గతంలో చిన్నపాటి వర్షానికి మా గుడిసె కురిసెది. ఇప్పుడు ఆ సమస్య పోయింది. ఇంట్లో అన్ని ఉన్నాయి. లిప్ట్ కూడా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి స్థలం కూడా ఉంది.

కెసిఆర్ సారుకు రుణపడి ఉంటాను. నావయసు 80 ఏళ్లు. సొంత ఇంట్లో నివసిస్తానని కలలోనూ అనుకోలేదు. మా గుడిసె చిన్న వర్షానికీ కురిసేది. ఇప్పుడిక ఆ సమస్య లేదు.

                                                                                       – గోపమ్మ,పిల్లి గుడిసెల వాసి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News