మూడో కూటమి సృష్టి!
ముహూర్తం సెప్టెంబర్ 2
ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం రోజునే కీలక నేతలతో మంతనాలు
మూడవ కూటమి ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు
బలమైన ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటి మీదికి తెచ్చేందుకు యత్నాలు
లౌకికవాదులు, కలిసి వచ్చే పార్టీలతో మొదలైన సంప్రదింపులు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర రాజకీయాలలో కీలక భూమిక పోషించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా దేశంలో మూడవ కూటమిని కూడగట్టేందుకు సమాలోచనలు సాగిస్తున్నారు. ఇందుకు వచ్చే నెల 2వ తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ రోజున ఢిల్లీలో తెలంగాణ భవన్ (టిఆర్ఎస్) కార్యాలయానికి సిఎం కెసిఆర్ భూమి పూజ చేయనున్నారు. అదే సమయంలో సిఎం కెసిఆర్ దేశవ్యాప్తంగా కీలక నేతలతో భేటి కానున్నట్లు తెలివచ్చింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీకి చెందిన ముఖ్యనేతలు, మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు హాజరువుతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ ముఖ్యులతో జాతీయ రాజకీయాలపై సిఎం కెసిఆర్ కీలక మంతనాలు జరపనున్నట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో బలోపేతంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు ఆయా పార్టీలను తిరిగి ఏకతాటిపై తీసుకరావాలని సిఎం కెసిఆర్ యోచిస్తున్నారు.
ఇందులో భాగంగా లౌకికవాదులు, తమతో కలిసి వచ్చే పార్టీలతో కెసిఆర్ మళ్లీ సం ప్రదింపులు జరపాలనే నిర్ణయానికి వచ్చినట్లు గా టిఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఆయన థర్డ్‌ఫ్రంట్ కో సం ప్రయత్నం చేస్తానని స్వయంగా వెల్లడించా రు. కానీ అప్పట్లో పరిస్థితులు అంతగా ఆశాజనకంగా లేకపోవడంతో కెసిఆర్ తన నిర్ణయా న్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం దేశ ప్రజల ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిల పట్ల ప్రజలు పూర్తిగా విముఖతతో ఉన్నారు. రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ప్రాంతీయ పార్టీల కలయిక దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మరోసారి ఢిల్లీ నేతలకు తెలిసి వచ్చేలా గట్టిగా బుద్ధిగా చెప్పాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఆ దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం కేంద్రంలో కొనసాగుతున్న మోడీ పాలన పట్ల ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోతోంది. ప్రధానంగా నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు రావడం, డీజీల్, పెట్రోల్, గ్యాస్ ధరలపై నియంత్రణ లేకపోవడంతో బిజెపి ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కేంద్రం ఒక్కటొక్కటిగా ప్రైవేటు పరం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఉదోగులు సైతం మోడీ ప్రభుత్వంపై నిరాసక్తితో ఉన్నారు. పైగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి కేంద్రం కొత్తగా ఉద్యోగాలను ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను సైతం ఊడగొడుతోంది. ఈ విషయంలో నిరుద్యోగ యువకులు సైతం మోడీ ప్రభుత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇదే సమయంలో సామన్య ప్రజలకు లబ్ధిచేకూరే విధంగా పెద్దగా సంక్షేమ పథకాలు సైతం అందడం లేదు.
ఇక వ్యవసాయం రంగంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనిపై కొద్ది నెలల పాటు ఢిల్లీలోనే రైతులు మకాం వేసి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యుత్ చట్టంపై కూడా పలు రాష్ట్రాలు బహిరంగంగానే కేంద్రంపై బహిరంగంగానే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్రాలకున్న అధికారాలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకునే విధంగా పలు నిబంధనలు తీసుకొచ్చింది. దీనిపై మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొదటి నుంచి మోడీ ప్రభుత్వంపై ఒంటిపై కాలిపైలేస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలనూ తీవ్ర స్థాయిలో తూర్పారపడుతున్నారు. వారితో పాటు మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఒరిస్సా, కేరళ వంటి నాన్ కాంగ్రెస్, బిజెపి పాలిత ముఖ్యమంత్రులు అవకాశం లభించిన ప్రతి సందర్భంలో మోడీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతున్నారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ఇచ్చిన హామీల్లో పెద్దగా పురోగతి లేకపోవడంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా కాషాయ పార్టీ పట్ల అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
అదే సమయంలో దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా ప్రజలు పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. అందుకే పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ పట్ల ప్రజల్లో పెద్దగా ఆదరణ చూపలేదని రుజువు చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు పెట్టని కోటల్లా ఉన్న రాష్ట్రాల్లో సైతం ఆ పార్టీ ప్రస్తుతం దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇక వామపక్షాల హవా కూడా దేశంలో పూర్తిగా పలచబడింది. ఆ పార్టీ ఉనికి కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా కనుమరుగు అయింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా మూడవ కూటిమి ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంలో సిఎం కెసిఆర్ కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలుగా కెసిఆర్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టి క్రియాశీల పాత్ర పోషించాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు జరగడం ఖాయమని తెలుస్తోంది.