మనతెలంగాణ/హైదరాబాద్ : శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో 104.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, యాదాద్రి భువనగిరి 87.5, సూర్యాపేటలో 62, నల్లగొండలో 61.3, జోగుళాంబ గద్వాల్‌లో 56.8, రంగారెడ్డిలో 54.8, సంగారెడ్డిలో 53, భద్రాద్రి కొత్తగూడెంలో 49.8, మహబూబాబాద్‌లో 49.5, వనపర్తిలో 50, హైదరాబాద్‌లో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రహదారులపై నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో నేడు, రేపు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర-, దక్షిణ ఒడిశా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వ్యాపించిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాని ప్రభావంతో రెండు రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వర్షం తాకిడిని తట్టుకునేందుకు మెట్రో ఫిల్లర్ల కింద…
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షం తాకిడిని తట్టుకునేందుకు మెట్రో ఫిల్లర్లతో పాటు ప్లైఓవర్‌ల కింద తలదాచుకున్నారు. నగరంలోని హైదర్‌గూడ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, లిబర్టీ, లక్డీకపూల్, ట్యాంక్‌బండ్, సూరారం, జీడిమెట్ల, ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో వివిధ పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
వైరాలో మునిగిన వరిచేను
ఖమ్మం జిల్లా వైరాలో వరిచేను నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వల్లాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పాలడుగు టు వల్లాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లందులోని కారేపల్లి కస్తూరిబా స్కూల్ ముందు ఉన్న మద్దలవాగు పొంగిపోర్లుతుండడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.