ఫేవరెట్లుగా బార్టీ, ఒసాకా, టైటిల్‌పై కన్నేసిన జ్వరేవ్
భారీ ఆశలతో సిట్సిపాస్, రుబ్లేవ్, సబలెంకా
నేటి నుంచి యూఎస్ ఓపెన్
న్యూయార్క్: ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సోమవారం తెరలేవనుంది. ఈ టోర్నమెంట్‌కు వరల్డ్ నంబర్‌వన్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జకోవిచ్ అరుదైన విజయానికి టైటిల్ దూరంలో నిలిచాడు. యూఎస్ ఓపెన్ ట్రోఫీని సాధిస్తే జకోవిచ్ ఖాతాలో రెండు అరుదైన రికార్డులు చేరుతాయి. అందులో ఒకటి కెరీర్ గ్రాండ్‌స్లామ్ కాగా, రెండో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఘనత. ఇక చిరకాల ప్రత్యర్థులు రఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెదరర్ (స్విట్లర్లాండ్)లతో పాటు డిఫెండింగ్ చాంపియన్ డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా) కూడా ఈసారి యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యారు. దీంతో జకోవిచ్ చారిత్రక విజయం సాధించే మార్గం మరింత సులువైందనే చెప్పాలి. అయితే టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, కిందటి రన్నరప్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), మూడో సీడ్ స్టెఫానొస్ సిట్సిపాస్ (గ్రీస్), ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా), ఆరో సీడ్ మాటియో బెర్రెటెని (ఇటలీ)లతో జకోవిచ్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
జోరుమీదున్న జ్వరేవ్
మరోవైపు జర్మనీ సంచలనం జ్వరేవ్ వరుస టైటిల్స్‌తో జోరుమీదున్నాడు. టోక్యోలో చారిత్రక స్వర్ణం సాధించడంతో అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇదే జోరును యూఎస్ ఓపెన్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. జ్వరేవ్ కిందటి సీజన్‌లో త్రుటిలో టైటిల్ సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఇక రష్యా స్టార్లుడానిల్ మెద్వెదేవ్, రుబ్లేవ్‌లు కూడా టైటిల్‌పై కన్నేశారు. కొంతకాలంగా వీరిద్దరూ పురుషుల సింగిల్స్‌లో నిలకడైన ప్రదర్శనతో అలరిస్తున్నారు. మెద్వెదేవ్ వరుస టైటిల్స్‌తో ఎదురులేని శక్తిగా మారాడు. ఇక రుబ్లేవ్ కూడా నిలకడైన ఆటతో దూసుకుపోతున్నాడు. మరోవైపు గ్రీకు వీరుడు సిట్సిపాస్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. అతను కూడా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నిలకడగా ఆడుతున్నాడు. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.
బెర్రెటెని, షపవలోవ్ (అర్జెంటీనా), కరెనొ బుస్టా (స్పెయిన్), 8వ సీడ్ కాస్పర్ రూడ్ తదితరులు కూడా సంచలనాలు సృష్టించే సత్తా కలిగిన వారే. అయితే ఎంత మంది బరిలో ఉన్నా ఈసారి పోరు మాత్రం జ్వరేవ్, జకోవిచ్‌ల మధ్యే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నాదల్, థిమ్‌లు లేక పోవడంతో వీరిద్దరి టైటిల్ అవకాశాలు మరింత చిగురించాయి. యూఎస్ ఓపెన్‌లో అద్భుత రికార్డు కలిగిన జకోవిచ్ ఈసారి కూడా ట్రోఫీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించిన జకోవిచ్ యూఎస్ ఓపెన్ సాధిస్తే పురుషుల టెన్నిస్‌లోనే అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. ప్రస్తుతం నాదల్, ఫెదరర్‌లతో కలిసి జకోవిచ్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నాదల్, ఫెదరర్‌లు కూడా తలో 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించారు. ఈసారి వారిద్దరూ బరిలో లేక పోవడంతో జకోవిచ్‌కు కలిసివచ్చే అంశంగా మారింది.
టైటిలే లక్ష్యంగా ఒసాకా, బార్టీ
మరోవైపు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ నవోమి ఒసాకా(జపాన్), వింబుల్డన్ విజేత, టాప్ సీడ్ ఆశ్లే బార్టీ (ఆస్ట్రేలియా) టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. వింబుల్డన్ టైటిల్‌తో బార్టీ జోరుమీదుంది. అంతేగాక ఇటీవలే బార్టీ ప్రతిష్టాత్మకమైన సిన్సినాటి ఓపెన్ మాస్టర్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఇక యూఎస్ ఓపెన్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక కిందటిసారి విజేత ఒసాకా కూడా టైటిలే లక్షంగా పోరుకు సిద్ధమైంది. యూఎస్ ఓపెన్ టైటిల్‌తో మళ్లీ గాడిలో పడాలని తహతహలాడుతోంది. ఇక రెండో సీడ్ అరినా సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కరోలినా ప్లిస్కొవా (చెక్), ఐదో ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్), ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), ఆరో సీడ్ బియాంకా అండ్రెస్కో (కెనడా) తదితరులు కూడా టైటిల్‌పై కన్నేశారు. అంతేగాక బార్బొరా క్రెజ్సికొవా, గార్బయిన్ ముగురుజా, పదో సీడ్ పెట్రా క్విటోవాలను కూడా తక్కువ అంచన వేయలేం.
ఇక మాజీ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రుమేనియా) కూడా టైటిల్‌పై కన్నేసింది. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో ఆడడంలో విఫలమవుతున్న హలెప్ యూఎస్ ఓపెన్ టైటిల్‌తో మళ్లీ గాడిలో పడాలనే పట్టుదలతో ఉంది. బెలిండా బెన్సిక్, విక్టోరియా అజరెంకా, అంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తదితరులు కూడా భారీ ఆశలతో యూఎస్ ఓపెన్‌కు సిద్ధమయ్యారు. మహిళల సింగిల్స్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిలందరూ బరిలోకి దిగుతుండడంతో ఈసారి యూఎస్ ఓపెన్ హోరాహోరీగా సాగడం ఖాయం.