హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో టమాట రూ. 4
న్యూఢిల్లీ: టమాట పండించే రాష్ట్రాలలోని హోల్‌సేల్ మార్కెట్లలో దాని ధర దారుణంగా పతనమైంది. సరఫరా అధికంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాలలో కిలో టమాట ధర రూ. 4కు పడిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణలో 31 టమాట పంట పండించే కేంద్రాలు ఉండగా వీటిలో 23 కేంద్రాలకు చెందిన హోల్ సేల్ మార్కెట్‌లో గత ఏడాదితో పోలిస్తే టమాట ధర 50 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. ప్రస్తుతం ఈ ఏడాది ఖరీఫ్ పంట చేతికొస్తున్న కాలంలో టమాట ధరలు దారుణంగా పతనం కావడం టమాట రైతులను కంటతడి పెట్టిస్తోంది. దేశంలోని అతి పెద్ద టమాట పంట పండించే కేంద్రమైన మధ్యప్రదేశ్‌లోని దేవస్‌లో హోల్‌సేల్ మార్కెట్‌లో ఆగస్టు 28న కిలో టమాట ధర రూ. 8 పలుకుతోంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 11 ఉంది. మహారాష్ట్రలోని జల్గావ్‌లో కిలో టమట ధర రూ. 4కు పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 21 ఉండగా 80 శాతం ఇప్పుడు ధర పతనమైంది.
ఔరంగాబాద్‌లో రూ. 4.50, సోలాపూర్‌లో రూ. 5, కొల్హాపూర్‌లో రూ. 6.50 చొప్పున కిలో టమాట ధర హోల్‌సేల్ మార్కెట్‌లో పలుకుతోంది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో టమాట పంట అధిక దిగుబడి జరిగి సరఫరా అత్యధికంగా ఉందని, దీంతో మార్కెట్‌లో టమోట ధర పతనమైందని జాతీయ హార్టికల్చరల్ రిసెర్చ్, డెవలప్‌మెంట్ ఫౌండేషన్(ఎన్‌హెచ్‌ఆర్‌డిఎఫ్) తాత్కాలిక డైరెక్టర్ పికె గుప్తా తెలిపారు. టమాట ధరలు పడిపోవడం వల్ల నష్టపోతున్న రైతులను ఆహార ఉత్పత్తి కంపెనీలు ఆదుకోవాలని ఆయన కోరారు.