ప్రధాని మోడీ, బెంగాల్ సిఎం మమత సంతాపం
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ రచయిత బుద్ధదేవ్‌గుహ(85) మరణించారు. కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొవిడ్ అనంతర సమస్యలకు చికిత్స తీసుకుంటూ ఆదివారం రాత్రి 11:25కు గుహ తుదిశ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రపిండాలకు ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరిన గుహ గుండెపోటుతో మరణించారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. గుహ భార్య రీతూగుహ రవీంద్ర సంగీత్ ప్రచారకర్త. ఆమె 2011లో మరణించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న తూర్పు బెంగాల్ ప్రాంతంలో గుహ జన్మించారు. ఆయన నవలలు,కథలు ప్రకృతి సౌందర్యాలను కళ్లకు కడ్తాయి. తూర్పుభారత్ అడవుల వర్ణన ఆయన రచనల్లో కనిపిస్తుంది.
భారత ఉపఖండంలో గుహకు సాహిత్యాభిమానులున్నారు. 1976లో ఆనంద పురస్కార్,శిరోమణ్ పురస్కార్,శరత్ పురస్కార్‌లాంటి పలు అవార్డులు ఆయణ్ని వరించాయి. గుహ రచనల్లో మథుకరి(మథు సేకరుడు), కోయిలర్ కచ్చే, సొబినయ్ నివేదన్ చెప్పుకోదగినవి. డిక్షనరీ అనే బెంగాలీ అవార్డు చిత్రం గుహ రచనలు బాబా హోవా, స్వామీ హోవా ఆధారంగా నిర్మించబడింది. ‘బుద్ధదేవ్‌గుహ ఇకలేరు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆయన భగవంతుని దీవెనలు అందుకున్నారు. ఆయన జీవితాన్ని కుటుంబం, స్నేహితులు ఆస్వాదిస్తున్నారు’ అంటూ గుహ కూతురు మాలినీ బి గుహ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గుహ కుటుంబసభ్యులకు ప్రధాని మోడీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రగాఢ సంతాపం తెలిపారు. గుహ మరణం తనను ఆవేదనకు గురి చేసిందని, ఆయన మరణంతో బెంగాలీ సాహిత్యంలో శూన్యం ఆవహించిందని మమత తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గుహ మరణం సాహిత్య ప్రపంచానికి తీరని లోటు అని ప్రధాని పేర్కొన్నారు.