Sunday, November 17, 2024

టీమిండియా ముమ్మర సాధన

- Advertisement -
- Advertisement -

Team India practice hard for the fourth Test

లండన్: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టు కోసం టీమిండియా కఠోర సాధన చేస్తోంది. లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో ఓవర్ వేదికగా జరిగే నాలుగో టెస్టు విరాట్ కోహ్లి సేనకు చాలా కీలకంగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవక తప్పదు. ఇటు ఇంగ్లండ్ అటు భారత్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం రెండు జట్లు 11తో సమంగా ఉన్నాయి. కిందటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్ ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు మూడో టెస్టులో విజయంతో ఆతిథ్య ఇంగ్లండ్ జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్ జో రూట్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.

సిరీస్‌లో ఇప్పటికే మూడు శతకాలు కొట్టి పెను ప్రకంపనలు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కూడా రూట్ నుంచి టీమిండియాకు ప్రమాదం పొంచివుంది. ఇదిలావుండగా లార్డ్‌లో చారిత్రక విజయం సాధించిన కోహ్లి సేన లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలింది. జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత్ చివరి ఏడు వికెట్లను 50 పరుగుల తేడాతో చేజార్చుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా మాత్రమే రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. మిగతావారు విఫలం కావడంతో లీడ్స్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. కానీ నాలుగో టెస్టులో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలన్నదే భారత్ లక్షంగా కనిపిస్తోంది.

దీని కోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో మళ్లీ పైచేయి సాధించాలని తహతహలాడుతున్నారు. ఇక కెప్టెన్ కోహ్లితో పాటు బుమ్రా, రాహుల్ తదితరులు మంగళవారం కఠోర సాధన చేశారు. మూడో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమైన ఓపెనర్ రాహుల్ ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. దీని కోసం ముమ్మర సాధన చేస్తున్నాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌లు కూడా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News