భారత్ మరో మూడు పతకాలు
తంగవేలుకు రజతం, శరద్, సింగ్‌రాజ్‌లకు కాంస్యాలు
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల జోరు మంగళవారం కూడా కొనసాగింది. ఈ రోజు భారత అథ్లెట్లు మరో మూడు పతకాలను గెలుచుకున్నారు. పురుషుల హై జంప్‌లో మరియప్పన్ తంగవేలు రజతం సాధించగా, భారత్‌కే చెందిన శరద్ కుమార్ కాంస్యం గెలుచుకున్నాడు. అంతేగాక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో భారత షూటర్ సింగ్‌రాజ్ అధాన కాంస్య పతకం సాధించాడు. ఈ క్రీడల్లో భారత్ ఇప్పటికే పది పతకాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఓ ఒలింపిక్స్‌లో భారత్ రెండంకెలా సంఖ్యలో పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ఇటీవలే ముగిసిన సాధారణ ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాలు గెలుచుకున్న విషయం విదితమే.
మరయప్పన్ చేజారిన స్వర్ణం
మంగళవారం జరిగిన పురుషుల హైజంప్ విభాగంలో దిగ్గజ అథ్లెట్ మరియప్పన్ తంగవేలు తృటిలో పసిడి పతకం సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆసక్తికరంగా సాగిన పోరులో అమెరికా పారా అథ్లెట్ సామ్ గ్రూ 1.88 మీటర్లు దూకి ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో సామ్‌కు పసిడి పతకం దక్కింది. ఇక భారత అథ్లెట్ తంగవేలు 1.86 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. తంగవేలు అద్భుత ప్రదర్శన చేసినా తృటిలో స్వర్ణం ఛాన్స్ కోల్పోయాడు. ఈ పారాలింపిక్స్‌లో తంగవేలు స్వర్ణమే లక్షంగా బరిలోకి దిగాడు. దానికి తగినట్టుగానే అసాధారణ ఆటతో అలరించాడు. ఫైనల్లో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా తృటిలో స్వర్ణం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు.
శరద్ ఖాతాలో కాంస్యం..
మరోవైపు ఇదే విభాగంలో పోటీ పడిన భారత అథ్లెట్ శరద్ కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్య సాధించాడు. చివరి వరకు నిలకడైన ప్రదర్శనతో అలరించిన శరద్ కుమార్ 1.83 మీటర్లు దూకి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో శరద్ కుమార్ ఖాతాలో కాంస్య పతకం చేరింది. కాగా, భారత్‌కే చెందిన మరో అథ్లెట్ వరుణ్ సింగ్ భాటి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రియో పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించిన వరుణ్ ఈసారి పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. చివరికి పతకం సాధించకుండానే వెనుదిరిగాడు. ఇదిలావుండగా టి42 వర్గీకరణలో భాగంగా ఈ హైజంప్ పోటీలు నిర్వహించారు. కాళ్లలో లోపం, పొడువులో వ్యత్యాసం, బలహీనమైన కండరాల శక్తి, క్రియాశీలకమైన కదలికలు లేని అథ్లెట్లు ఈ విభాగంలో పోటీ పడతారు. ఈ పోటీల్లో ముగ్గురు భారత అథ్లెట్లు పతకాలు సాధించేలా కనిపించారు. కానీ చివరికి భారత్‌కు రెండు పతకాలు మాత్రమే లభించాయి.
షూటింగ్‌లో మెరిసిన అధాన
టోక్యో పారాలింపిక్స్ షూటింగ్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. మహిళల షూటింగ్‌లో అవని స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ ఎస్‌హె 1 విభాగంలో భారత క్రీడాకారుడు సింగ్‌రాజ్ అధాన కాంస్య పతకం సాధించాడు. అద్భుత ప్రదర్శన చేసిన అధాన 21.6.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. చైనా షూటర్, డిఫెండింగ్ చాంపియన్ చావో యాంగ్ 237.9 పాయింట్లతో సరికొత్త రికార్డు సాధించి స్వర్ణం సాధించాడు. ఇక చైనాకే చెందిన హువాంగ్ జింగ్ 237.5 పాయింట్లతో రజతం సొంతం చేసుకున్నాడు.
రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా అభినందించారు. తంగవేలు, శరద్ కుమార్, అధానలు అద్భుత ఆటతో భారత ఖ్యాతిని ఇనుమనడింప చేశారని ప్రశంసించారు. ప్రతిష్టాత్మకమైన పారాలింపిక్స్‌లో పతకాలు సాధించడం ద్వారా దేశ పేరును ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగేలా చేశారని వారు కొనియాడారు.