దోహా : తాలిబన్లతో భారత్ మంగళవారం తొలి భేటీ అయింది. భారత్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్న తాలిబన్ల విజ్ఞప్తి ప్రకారమే ఖతార్‌లో భారత రాయబారి దీపక్ మిత్తల్‌తో చర్చించడానికి తాలిబన్ల రాజకీయ కార్యాలయం అధిపతి షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానీజాయి దోహా లోని భారత కార్యాలయానినకి వచ్చారు. ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్‌లో చిక్కుకు పోయిన భారతీయుల్ని సురక్షితంగా వెనక్కు రప్పించడంతోపాటు భారత్‌కు రావాలని కోరుకుంటున్న మైనార్టీల తరలింపు అంశంపై ప్రధానంగా చర్చించారు. అఫ్గాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక చర్యలకు , ఉగ్రవాద కార్యకలాపాలకు వాడకూడదని దీపక్ మిట్టల్ తాలిబన్లను కోరారు. ఈ సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవడంపై తాలిబన్ ప్రతినిధి హామీ ఇచ్చినట్టు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్‌తో సాధారణ, వాణిజ్య, దౌత్య, రాజకీయ సంబంధాలను తాము కాంక్షిస్తున్నట్టు మూడు రోజుల క్రితమే స్టానీజాయి ఒక ప్రకటనలో కోరినా, భారత్ దానికి మౌనం వహించింది. అయితే కాబూల్ నుంచి అమెరికా సైన్యాలు పూర్తిగా వైదొలగడంతో తాలిబన్లతో చర్చలకు సిద్ధమైంది.