ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక వైద్య విధానంగా గుర్తించబడి అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నది అల్లోపతీ వైద్యవిధానం. అన్నిరంగాలలోను, వివిధ (భౌతిక, రసాయనిక, ఔషధ, జన్యు తదితర) శాస్త్ర శాఖలలో సంతరించుకుంటున్న అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక జ్ఞానాన్ని, సమ్మిళితం చేసుకుంటూ ఇముడ్చుకుంటూ, సమన్వయం చేసుకుంటూ అల్లోపతి వైద్య విధానం మానవాళి అనారోగ్య సమస్యలను పరిష్కరించటంలో ముందంజ వేస్తోంది. దీనితో పాటుగా విస్తరిస్తున్న పరిశోధనా రంగం, ఔషధ ఉత్పత్తి రంగం బృహత్తరమైన ఆర్ధిక కార్యకలాపాలకు కేంద్ర మయ్యింది. పెట్టుబడిదారులకు విపరీతమైన లాభాలు సమకూర్చే వనరుగా మారిపోయింది. మానవ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నామా? అనారోగ్యాన్ని పెంచి పోషిస్తున్నామా? లాభాల వేటలో అనారోగ్యాన్ని సృష్టిస్తున్నామా? వాడుతున్న ఔషధాల వల్ల ఉద్భవిస్తున్న విపరిణామాలు, దుష్పరిణామాలు ఈ వైద్య విధానపు మౌలిక విలువలను, శాస్త్రీయతను సందేహాస్పదం చేస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టిని మరల్చుతున్నాయి. కొత్త ఆలోచనలు పురివిప్పుతున్నాయి.
వేల సంవత్సరాలుగా, వివిధ జాతులు, వివిధ ప్రాంతాలలో అనుసరించి, సంతరించుకున్న వైద్య విజ్ఞాన సంపద వైపు దృష్టి పడుతోంది. సంప్రదాయ వైద్య విధానాల పునరుద్ధరణ ఆవశ్యకతను గుర్తిస్తున్నారు. ఈ ఖాళీని పూరించటం కూడా శాస్త్రీయమైన పద్ధతులతోనే జరగాలి. కానీ అభివృద్ధి ఆగిపోయిన, ప్రాధమిక పద్ధతులనే తిరిగి అనుసరించటం మానవ వికాస చరిత్రను ప్రాచీన లేక ఆటవిక దశలకు మరలించటమే అవుతుంది. సంప్రదాయం పేర, గృహ వైద్యం పేర, కుటుంబ వారసత్వ నైపుణ్యం పేర, పరోపకార ఉద్దేశం పేర, ఉచిత వైద్యం పేర ఆశాస్త్రీయతను, అజ్ఞానాన్ని ప్రవేశపెట్టకూడదు, ప్రోత్సహించకూడదు. అలాగని చారిత్రకంగా సంపాదించిన జ్ఞాన భాండారాన్ని అవివేకమని, మూఢ నమ్మకమనీ ఈసడించి తృణీకరించకూడదు. జాగ్రత్తగా ఏరుకుని, నిర్ధారించుకుని మేలైన పద్ధతులను, మెరుగైన అంశాలను, నేటి అవసరాల కనుగుణంగా అభివృద్ధి చేసి నూతన సమీకృత విధానాలను అభివృద్ధి చేయాలి.
కానీ అధునాతన వైద్యం పేర కార్పొరేటు ఔషధ సంస్థలు ఎలా లాభాలు మూటగట్టుకున్నాయో, అదే మాదిరిగా సంప్రదాయం పేరిట, చవక వైద్యం పేరిట కొత్త కంపెనీలు పుట్టుకొచ్చి వ్యాపారం ఇనుమడింప చేసుకుంటాయి. ఇప్పటికే ప్రజలలో సంప్రదాయ పద్ధతుల పట్ల పెరుగుతున్న ఆదరణను మోజుగా మార్చి తమ వ్యాపారం వృద్ధి చేసుకుంటున్న పెద్ద వ్యాపార సంస్థలు వున్నాయి. ఒకరు ఆధునిక శాస్త్రం పేరున, మరొకరు సంప్రదాయ పద్ధతి పేరున ప్రజలను వంచన జేస్తున్నారు. అందువల్ల ఆర్ధిక కోణాన్ని అదుపులో వుంచటంతో పాటు, ఒక విధానపు జ్ఞాన కోణాన్ని కూడా పరిగణించి వైద్య విధానాలను అభివృద్ధి చేయాలి. దీనికి సరైన, ప్రజానుకూల పరిపాలనా దృష్టి అవసరం. లేకపోతే నాలుగు మొక్కల పేర్లు తెలిసిన ప్రతి ఒక్కరూ వైద్యులుగా చలామణి అవుతారు. ఇంజెక్షన్ ఇవ్వటం వచ్చిన ప్రతి వ్యక్తి మన గ్రామాలలో ఆధునిక వైద్యునిగా చలామణి కావటం లేదా? ఒక లోపాన్ని సరిదిద్దటం కోసం మరో లోపభూయిష్టమైన పద్ధతి అనుసరించడం సరయినది అవుతుందా?
సంప్రదాయ వైద్యాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చు అనే దానికి చైనా ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఆధునిక వైద్య సదుపాయాలు ఎంతగా అభివృద్ధి చేసిన వారు తమ సంప్రదాయ విధానాలను కూడా అనుసరిస్తున్నారు.
ప్రతి పెద్ద చిన్న ఆసుపత్రులలో చైనా సంప్రదాయ వైద్య విభాగం (టిసిఎం) వుంటుంది. ప్రత్యేక శిక్షణ ఇచ్చే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పని చేస్తున్నాయి. కరోనా సందర్భంలో కూడా చైనా సంప్రదాయ వైద్య పద్ధతులను మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రచురించిన చికిత్సా పద్ధతులను ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చోట్ల ఆమోదించి అనుసరించారు. ఉదాహరణగా టిబెట్‌లో సంప్రదాయ వైద్యాన్ని చైనా ఎలా అభివృద్ధి చేస్తోందో తెలుసుకుంటే మనం కూడా మన సంప్రదాయ వైద్య విధానాలను ఎలా తిరిగి ఉపయోగించుకోగలమో అర్ధం చేసుకోగలం. టిబెట్ సంప్రదాయ వైద్యానికి చైనా విస్తృతమైన అభివృద్ధి వ్యవస్థను కల్పిస్తోంది.
చైనాలో టిబెట్ ఒక స్వయంప్రతిపత్తి గల చిన్నప్రాంతం. గత ఏడు దశాబ్దాలలో చైనా ప్రభుత్వం టిబెట్‌లో స్థిరత్వం కోసం అక్కడి సాంస్కృతిక అభివృద్ధి కోసం గణనీయమైన ప్రయత్నాలు చేసింది. వారి సంప్రదాయ వైద్య విధానాలను పునరుద్ధరించి అభివృద్ధి చేస్తోంది. టిబెట్‌లో సోవరిగ్పా గా పిలువబడే టిబెట్ సంప్రదాయ వైద్యానికి 2,500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. సంప్రదాయ టిబెట్ వైద్యంపై ప్రజలకు అవగాహన కూడా ఉంది. బీజింగ్ టిబెటన్ మెడిసిన్ హాస్పిటల్ (బిటిఎంహెచ్) 1992లో స్థాపించబడింది. ఈ వైద్య కళాశాల ప్రజల అవగాహనను మరింత మెరుగు పరిచింది. ఈ సంస్థ ఏర్పాటు అల్ప సంఖ్యాక జాతుల సంప్రదాయ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి మార్గం సుగమం చేసింది. జాతి సంస్కృతుల అభివృద్ధిని ప్రోత్సహించింది.
సంప్రదాయ టిబెటన్ వైద్యం ఆధునిక అభివృద్ధి కోసం జరుగుతున్న కృషిని గురించి సిజిటిఎన్ కు (మే,18,2015 న) ఇచ్చిన ఇంటర్వ్యూలో టిఎంహెచ్ డైరెక్టర్ డ్రోల్కర్బి గ్యాప్ అనేక విషయాలు చెప్పారు. దాని ప్రకారం వైద్యశాస్త్రం, విద్యాబోధన కోసం పని చేస్తున్న అనేక మంది వైద్యులు, పరిశోధకులకు ముందుగా ఈ విధానాలపై అవగాహన కల్పించారు. టిబెటన్ మెడిసిన్ క్లాసిక్ (టిబెటన్ వైద్య గ్రంధం) జాతీయ వారసత్వంగా జాబితాలో చేర్చబడింది, నవీకరించబడింది: లాసా- టిబెటన్ వైద్యంపై ఒక క్లాసిక్ పుస్తకం జాతీయ వారసత్వపు జాబితాలో చేర్చబడింది. అంతరించిపోతున్న జాతి వైద్యాన్ని రక్షించడానికి చైనా ప్రయత్నిస్తోంది. చైనా జాతీయ జాబితాలో భాగంగా ఫోర్ వాల్యూమ్స్ ఆఫ్ మెడిసిన్ (ఎఫ్‌విఎం)ను ఎంపిక చేశారు. ఎఫ్‌విఎం, అత్యంత క్రమబద్ధమైన, అత్యంత సంపూర్ణ పుస్తకంగా విస్తృతంగా పరిగణించబడుతుంది టిబెటన్ వైద్యం, 156 అధ్యాయాలను కలిగి ఉంది. అది 1546 లో టిబెట్ జాతి వైద్యశాస్త్రంలో ప్రముఖ పుస్తకంగా మారింది.
ఆసుపత్రి అధిపతి యెషే యాంగ్జోమ్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి స్థాపన ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే ఇది వ్యాధిగ్రస్థు లకు సహాయపడటమే కాకుండా వైద్య రంగంలో చారిత్రక వారసత్వాన్ని అందిస్తుంది, ఆరోగ్య రక్షణ పై ప్రజల అవగాహనను కూడా పెంచుతుంది అని అన్నారు. టిబెట్ ప్రాంతీయ ప్రభుత్వం అంతర్జాతీయ వారసత్వ జాబితాలో స్థానం కోసం దరఖాస్తు చేయాలని యోచిస్తోంది. వీటిలో టిబెటన్ వైద్యాన్ని తయారు చేసే ప్రయత్నంలో యునెస్కో వారి మెమరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రామ్ తోడ్పడుతోంది. మరింత గుర్తింపు, మెరుగైన రక్షణ.
7 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం ప్రారంభం వరకు ఈ సంప్రదాయ వైద్య విధానం గురించి అనేక పుస్తకాలు, పత్రాలు పోగుపడి ఉన్నాయి. సంప్రదాయ టిబెట్ వైద్యంపై 5,000 కు పైగా పురాతన రచనలు ఉన్నాయి. చాలా ఉన్నాయి కానీ, ఇతర కారణాలతో పాటు సరిగ్గా జాగ్రత్త పెట్టకపోవటం వలన అవి కొంతవరకు పాడైపోయాయి. కొన్నిటిని పూర్తిగా కోల్పోవడం కూడా జరిగింది. దొరికిన వైద్య గ్రంధాలన్నీసేకరించి, 600 కు పైగా రచనలను డిజిటలైజ్ చేశారు. దేశం సుమారు 6.9 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. జినింగ్- క్వింఘై టిబెటన్ ఔషధ పరిశోధనా సంస్థ ఈ పనిని చేపట్టి పూర్తి చేసింది. ‘డిజిటలైజేషన్ అసలు అరుదైన పురాతన పుస్తకాలు, పత్రాలను సంరక్షించడంలో సహాయపడుతుంది, నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్ కొరకు మరింత సౌకర్యవంతమైన వేదికను అందిస్తుంది’ అని సంస్థ సాహిత్య సమాచార కేంద్రం డైరెక్టర్ హార్డ్ రోజీ తెలిపారు. ‘విలువైన పరిశోధనా అంశాలను ప్రజలతో పంచుకోవడం చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం’ అని అన్నారు. ఈ సంస్థ పరిశోధకులను ఇతర ప్రాంతాలకు కూడా పంపింది.
వీరు బ్రిటన్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్‌తో సహా అనేక దేశాలలో 1,000 కు పైగా పత్రాలను సేకరించారు. 600కు పైగా పత్రాలను డేటాబేస్‌లో ఉంచారు. దీనితో పాటుగా వేలాది మందికి ఈ విధానాన్ని పరిచయం చేశారు. సంప్రదాయ టిబెటన్ ఔషధ పదార్థాలు, సన్నాహాలు, 300 రోగనిర్ధారణ పద్ధతులు, చికిత్సలు అలాగే 800 అకడమిక్ జర్నల్స్ ఉన్నాయి. ఇవి 2006లో చైనా సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి.
ఇలా దశబ్దాలుగా ఒక ప్రణాళిక ప్రకారం, ఒక నిర్దిష్ట దృష్టితో సంప్రదాయ వైద్య విధానాలను అభివృద్ధి చేసి ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చవలసి వుంది. కానీ నిప్పు అంటుకున్నాక నుయ్యి తవ్వినట్లు ఏ కరోనాయో చుట్టు ముట్టినప్పుడు, ఆరోగ్య వ్యవస్థలు కూలిపోయినప్పుడు- ఆయుర్వేదం పేర ఏ పతంజలి నో, మూలిక వైద్యం పేర ఏ ఆనందయ్య నో, తాత్కాలికంగా ముందు కు తేవటం, ప్రభుత్వాలు తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చటానికి తప్ప మరెందుకూ పనికి రాదు. ముఖ్యంగా సంప్రదాయ వైద్య విధానాల అభివృద్ధికి అసలే పనికి రాదు. ఆయుష్ వంటి సంస్థలను నామమాత్రంగా ఏర్పరచినా వాటిని స్థిరమైన పునాదులపై నిర్వహించటం లేదు. ప్రజలకు అనుకూలమైన వైద్య విధానాల రూపకల్పనలకూ, మౌలిక వసతుల నిర్మాణానికి తిలోదకాలు ఇచ్చిన ప్రభుత్వాలు సమగ్రమైన వైద్య వ్యవస్థను అభివృద్ధి చేస్తాయని ఆశించగలమా?