అఫ్గాన్ బోర్డుకు స్పష్టం చేసిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్థాన్ క్రికెటర్లకు పెద్ద ఊరటనిచ్చే వార్త తాలిబన్ల నుంచి వచ్చింది. అఫ్గాన్ క్రికెట్‌లో తాము జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తాలిబన్లు ఆ దేశ క్రికెట్ బోర్డుకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంతకుముందే షెడ్యూల్ ఖరారు చేసిన మ్యాచ్‌లు ఆడేందుకు అంతరాయం కలింగబోమని తాలిబన్లు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అఫ్గాన్ క్రికెట్‌కు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వసీఖ్ వెల్లడించారు. ఆస్ట్రేలియాతో నవంబర్‌లో అఫ్గానిస్థాన్ ఆడే టెస్టు మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంని ఆయన స్పష్టం చేశారు. అంతేగాక అఫ్గాన్ క్రికెటర్లు విదేశాలకు, విదేశీ ఆటగాళ్లు అఫ్గాన్‌కు వచ్చేందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవని వివరించారు. ఇదిలావుండగా తాలిబన్లు తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలితో పాటు పలు దేశాల క్రికెట్ బోర్డులు స్వాగతించాయి.