Friday, November 22, 2024

అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ ఉత్తమ నిర్ణయం : బైడెన్

- Advertisement -
- Advertisement -

Withdrawal of forces from Afghanistan is best decision:Biden

అమెరికాకు ప్రయోజనం లేని కొనసాగింపు ఎందుకు ?
గత ఇరవై ఏళ్లుగా రోజుకు 300 మిలియన్ డాలర్లు అఫ్గాన్‌కు ఖర్చు చేశాం
అనేక సవాళ్లు ఎదుర్కొని అమెరికా ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యం

వాషింగ్టన్ : అఫ్గాన్‌స్థాన్ నుంచి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి సమర్థించుకున్నారు. ఇది తెలివైన, ఉత్తమ నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం బైడెన్ తమ దేశ ప్రజలను ఉద్దేశించి శ్వేతభవనం నుంచి ప్రసంగించారు. ఇరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలుకుతూ లక్షా ఇరవై వేల మందిని అఫ్గాన్ నుంచి తరలించే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. చరిత్రలో ఏ దేశం ఎప్పుడూ ఈ విధంగా చేయలేదని, అమెరికా మిలిటరీ అద్భుత నైపుణ్యం, ధైర్యం వల్లనే ఈ ఆపరేషన్ విజయవంతమైందని బైడెన్ ప్రశంసించారు. అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు అఫ్గాన్‌లో బలగాలను కొనసాగించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. అమెరికన్లను ఉద్దేశిస్తూ ఇప్పుడు మీకు ఇరవై ఏళ్లు ఉంటే గనుక …..అమెరికా శాంతియుతంగా ఉండడం మీరెప్పుడూ చూసి ఉండరు,. ఈ యుద్దాన్ని , బలగాల ఉపసంహరణను ఇంకా పొడిగించాలని కోరుకోలేదు.

ఇరవై ఏళ్ల తరువాత కూడా మరో తరం అమెరికా బిడ్డలను యుద్దానికి పంపాలనుకోవట్లేదని బైడెస్ స్పష్టం చేశారు. ఈ యుద్ధాన్ని ముగిస్తానని, అఫ్గాన్ నుంచి బలగాలను తిరిగి వెనక్కు రప్పిస్తానని అధ్యక్ష పదవికి తాను పోటీ పడినప్పుడే దేశ ప్రజలకు హామీ ఇచ్చానని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. అఫ్గాన్‌లో వేలాది మంది సైనికులను కొనసాగించడంతోపాటు బిలియన్ డాలర్లను ఖర్చు చేయడం వల్ల అమెరికన్ల భద్రత పెరుగుతుందని తాను విశ్వసించడం లేదని బైడెన్ స్పష్టం చేశారు. గత ఇరవై ఏళ్లుగా రోజుకు 300 మిలియన్ డాలర్లను అఫ్గాన్ కోసం ఖర్చు చేసినట్టు బ్రౌన్ యూనివర్శిటీ పరిశోధకులు అంచనా వేశారని ఈ విధంగా విపరీతమైన ఖర్చు చేసి అనేక అవకాశాలు కోల్పోయామని పేర్కొన్నారు. అమెరికాకు ప్రస్తుతం అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, చైనాతో పోటీ, రష్యాతో విభేదాలు, సైబర్ దాడులు, అణ్వస్త్రాలు ఇలా అనేక సవాళ్లు తమ ముందున్నాయని వివరించారు.

అయితే బలగాలను ఉపసంహరించినప్పటికీ అఫ్గాన్‌తోపాటు ఇతర దేశాల్లోని ఉగ్రవాదంపైనా పోరు కొనసాగిస్తామని, దీనికోసం ఆయా దేశాల్లో ఉండి, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమెరికా జవాన్లు, అఫ్గాన్ పౌరులు మరణించడంపై ఆయన విచారం వెలిబుచ్చారు. డ్రోన్‌తో దాడిచేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాము తరువాత మట్టుబెట్టామని, దీంతో అమెరికా సామర్ధం ఏమిటో ఉగ్రవాదులకు స్పష్టంగా అర్థమైందని బైడెన్ చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఉద్దేశించి మీపై పోరు ఇంకా ముగియలేదని గట్టిగా హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News