Friday, November 22, 2024

వ్యూహం మార్చు.. సాయం చేస్తా

- Advertisement -
- Advertisement -

Key phone conversation between Biden and Ashraf Ghani

తోకముడిచిన నేతతో బైడెన్
వెలుగులోకి వచ్చిన ఫోన్‌సంభాషణ
అఫ్రఫ్ వైఖరిపై అసహనం
లోకల్ బలమే కీలకమని సలహా
తీరు మారాలనే లోపే తాలిబన్ల ఎంట్రీ

వాషింగ్టన్ /కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు పూర్తిస్థాయిలో తమ ఆధిక్యతను చాటుకోవడానికి ముందు అమెరికా అధ్యక్షులు జో బైడెన్, అఫ్ఘన్ మాజీ అధ్యక్షులు అష్రఫ్ ఘనీ మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగింది. దేశంలో పరిస్థితిని అదుపులో పెట్టగలననే నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తే అమెరికా సాయం కొనసాగుతుందని ఈ దశలో బైడెన్ అష్రఫ్‌కు తెలిపారు. జులై 23వ తేదీన ఇరువురు నేతల మధ్య దాదాపు 14 నిమిషాల పాటు జరిగిన ఫోన్ సంభాషణ సారాంశాన్ని, దీనిలోని వివరాలను రాయిటర్స్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. ముందు ఆలోచనా ధోరణిని, పరిస్థితి పట్ల దృక్పథాన్ని మార్చుకుంటే మంచిదని ఘనీకి ఈ సందర్భంగా బైడెన్ తేల్చిచెప్పారు. ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణ ఇదే చివరిది. ఆ తరువాత దేశంలో పలు ప్రాంతాలలో తాలిబన్లు తమ ఆధిక్యతను చాటుకుంటూ చివరికి ఆగస్టు 15వ తేదీన కాబూల్‌లో ప్రవేశించడం, అష్రఫ్ రహస్యంగా దేశం విడిచిపెట్టి పోవడం జరిగింది.

పరిస్థితిని అదుపులో పెట్టేందుకు ఏదైనా వ్యూహాత్మక చర్యకు సిద్ధం అయ్యారా? అయితే దీనిని ప్రజలకు తెలియచేయగలరా? పరిస్థితిపై అదుపు ఉందని విశ్వాసం కనబర్చగలరా? అని బైడెన్ పదేపదే అష్రఫ్‌ను ప్రశ్నించినట్లు ఈ సంభాషణ క్రమంలో తేలింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సైనిక సాయం, రాజకీయ వ్యూహాలు, స్పందన వంటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఇరువురు నేతలకు దేశం మొత్తం తక్షణ రీతిలోనే తాలిబన్ల గుప్పిట్లోకి చేరుతుందని కానీ అధికార పీఠం కూలుతుందని కానీ తెలియదని ఈ సంభాషణ క్రమంలో స్పష్టం అయింది. దేశంలో పరిస్థితిని కంట్రోలు చేయగలరా? చేయగలనని ప్రజలకు భరోసా ఇవ్వగలరా? అని బైడెన్ ప్రశ్నించి, ఈ విధంగా చేయగలిగితే తమ నుంచి వైమానిక బలగాల మద్దతు కొనసాగుతుందని, అయితే తాలిబన్లను అదుపులో పెట్టేందుకు ఎటువంటి వ్యూహం ఉందనేది తమకు తెలియాల్సి ఉందని బైడెన్ స్పష్టం చేసినట్లు సంభాషణ క్రమంలో వెల్లడైంది.

ఈ ఫోన్‌కాల్‌కు ముందు అఫ్ఘన్ భద్రతా బలగాలకు మద్దతు నిస్తూ అమెరికా సేనలు వైమానిక దాడులకు దిగాయి. అప్పటికీ తాలిబన్ల పట్ల కఠినవైఖరినే ప్రదర్శించాలని బైడెన్ నిర్ణయించుకున్నట్లు ఈ ఘటనతో తేటతెల్లం అయింది. అయితే దోహా శాంతి ఒప్పందానికి విఘాతంగా అమెరికా ఈ చర్యకు దిగిందని తాలిబన్లు ఆక్షేపించారు. తాలిబన్లను దెబ్బతీసేందుకు ఇతరత్రా శక్తివంతమూన అఫ్ఘన్లకు సైనిక వ్యూహ బాధ్యతలు అప్పగించాలని, అప్పుడే కార్యాచరణలో ఇది సమర్థవంతం అయిన ఫలితాలు ఇస్తుందని కూడా ప్రెసిడెంట్ బైడెన్ ఈ సందర్భంగా ఘనీకి తెలిపారు. దేశంలో జరిగే యుద్ధాలతో ఆరితేరిన యోధుడికి ఈ బాధ్యత ఇస్తే మంచిదని ఆయన ఈ సందర్భంగా రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా ఖాన్ మెహమ్మది గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. అంతేకాకుండా అఫ్ఘన్ సాయుధ బలగాలను బైడెన్ కొనియాడారు. వీటికి పూర్తి స్థాయి సైనిక శిక్షణ, నిధుల సాయం అమెరికా నుంచి అందింది. అఫ్ఘన్‌కు బలమైన సైన్యం ఉందని, మొత్తం 3 లక్షల సైన్యంలో దాదాపు 70 నుంచి 80 వేల వరకూ బాగా పోరాడగల శక్తివంతులు అని కూడా కితాబు ఇచ్చారు.

అయితే బైడెన్ నుంచి ఈ విధమైన ప్రశంసలు అందిన కొద్ది రోజుల క్రమంలోనే దేశంలో పలు ప్రాంతాలలో అఫ్ఘన్ సేనలు తాలిబన్ల ముందు తోకముడుస్తూ వచ్చాయి. తాలిబన్లకు పెద్దగా ప్రతిఘటన కూడా ఇవ్వలేదు. కాబూల్ కూడాతాలిబన్ల హస్తగతంతో సైన్యం ఏమీ చేయలేకపోయిందనే విషయం స్పష్టం అయింది. అష్రఫ్ ప్రభుత్వానికి తాలిబన్లతో పోరు విషయంలో కానీ , ప్రపంచదేశాలలో ప్రభుత్వం పట్ల సరైన నమ్మకం కల్పించడంలో కానీ సమగ్ర దృక్పథం లేదని బైడెన్ ఈ సందర్భంగా ఎక్కువ సేపు చెప్పారు. ప్రపంచ దేశాలలో అఫ్ఘనిస్థాన్ ప్రజలలో భరోసా కల్పించే దిశలో వ్యవహరించడం లేదని, దీనితో తాము ఏం చేయాలనుకున్నా అది చేసినా ఫలితం లేని స్థితికి వస్తుందని అసంతృప్తిని సూచనప్రాయంగా తెలిపారు.

నిజం అయినా కాకపోయినా అఫ్ఘన్ ప్రభుత్వ వైఖరి పట్ల విభిన్న వైఖరిని చిత్రీకరించడం వల్లనే ప్రయోజనం ఉంటుందని తేల్చిచెప్పారు. అఫ్ఘన్ల ప్రమేయంతో తాలిబన్లపై సైనిక చర్యలు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని కలుగచేయాల్సి ఉంటుంది. నూతన సైనిక వ్యూహానికి తమ మద్దతు ఉంటుందని అఫ్ఘన్ ప్రముఖ నేతలు విలేకరులతో చెప్పడం జరిగితే సైనిక చర్యల పట్ల సరికొత్త దృక్పథం ఏర్పడుతుందని , దీని వల్లనే సరైన ఫలితం ఉంటుందని తాను భావిస్తున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు. అష్రఫ్ బైడెన్ ఫోన్‌కాల్ గురించి స్పందించేందుకు వైట్‌హౌస్ వర్గాలు నిరాకరించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News