సిలిండర్ ధరల పెంపుపై రాహుల్
న్యూఢిల్లీ : దేశ జిడిపి వృద్థిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త రీతిలో చూపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. గ్యాస్ డీజిల్ పెట్రోలు (జిడిపి) రేట్ల పెరుగుదలతో వాస్తవ జిడిపికి మోడీసర్కారు తనదైన నిర్వచనం ఇచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో వంటగ్యాసు సిలిండర్ రేట్లు పాతిక రూపాయల చొప్పున పెంచిన విషయంపై రాహుల్ తీవ్రస్థాయిలో బుధవారం స్పందించారు. దేశ ప్రగతిని తెలిపే స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) ఎదుగుదలను ఈ ప్రభుత్వం తన పాలనలో చూపలేకపోతోంది.
అయితే వంటగ్యాసు, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో ఈ విధంగా ఈ జడిపి వృద్ధి చూపుతోందని వ్యాఖ్యానించారు. మోడీజీ తరచూ జిడిపి పెరుగుతోందని చెప్పడం పరిపాటి అయిందని ., ఇప్పుడు తనకు తెలిసిన దాని ప్రకారం ఆయన చూపే జిడిపి ఇదేనని అర్దం అయిందని రాహుల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పటివరకూ మోడీ చెపుతున్న జిడిపి పెరుగుదలను ప్రజలంతా ఇప్పుడు ఈ విధంగా ఈ జిడిపి హెచ్చింపుతో సరిపోల్చుకుంటే మంచిదని సూచించారు. ఇకపై ఎవరూ అయోమయానికి గురికారాదని, జిడిపి పెరిగిందని పెద్దలు చెపితే ఈ జిడిపికి వర్తింపచేసుకోవాలని చమత్కరించారు. ఇప్పుడు దేశంలో వంటగ్యాసు సిలిండర్ ధరలు ఎంత ఉన్నాయనేది తెలిసిందని, కాంగ్రెస్ హయాం ముగిసిన దశలో 2014లో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ 410గా ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు.