జోరుమీదున్న ఇంగ్లండ్, ప్రతీకారం కోసం భారత్, నేటి నుంచి నాలుగో టెస్టు
లండన్: ఓవల్ వేదికగా గురువారం నుంచి జరిగే నాలుగో టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్‌భారత్ జట్లు సిద్ధమయ్యాయి. మూడో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ సమరోత్సాహంతో పోరుకు రెడీ సిద్ధమైంది. మరోవైపు లీడ్స్‌లో ప్రత్యర్థి చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు చెరోదాంట్లో విజయం సాధించాయి. ఇందులో గెలిచే జట్టు సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళుతోంది. దీంతో రెండు జట్లు కూడా నాలుగో టెస్టును సవాల్‌గా తీసుకున్నాయి. ఇటు ఇంగ్లండ్, అటు భారత్‌లోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు సిరీస్‌లో భాగంగా మూడు టెస్టులు జరిగాయి. తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక లార్డ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలిచి సిరీస్‌ను 11తో సమం చేసింది.
ఓపెనర్లే కీలకం..
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రాహుల్, రోహిత్‌లపై భారీ ఆశలు పెట్టుకుంది. మూడో మ్యాచ్‌లో రోహిత్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. అయితే రాహుల్ మాత్రం రెండు ఇన్నింగ్స్‌లలోనూ నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్, రాహుల్‌లు జట్టుకు కీలకంగా మారారు. వీరిద్దరూ మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓపెనర్లు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి చాలా వరకు తొలగిపోతోంది. దీంతో రోహిత్, రాహుల్‌లు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు.
ఆ ఇద్దరు రాణించాలి..
మరోవైపు ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టుకు అండగా నిలుస్తారని భావించిన సీనియర్లు చటేశ్వర్ పుజారా, వైస్ కెప్టెన్ అజింక్య రహానెలు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. మిస్టర్ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్న పుజారా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నాడు. అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. అయితే మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం ఒక్కటే టీమిండియాకు కాస్త ఊరటనిచ్చే అంశం. ఇక రహానె మాత్రం సిరీస్‌లో ఒక్కసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. జట్టులో ఎంతో కీలకమైన రహానె వరుస వైఫల్యాలు చవిచూస్తుండడంతో బ్యాటింగ్ బలహీనంగా మారింది. ఇప్పటికైనా రహానె తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడూ విదేశీ పిచ్‌లపై అసాధారణ రీతిలో రాణించిన రహానె కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది.
కోహ్లిపై అందరి కళ్లు..
కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ జో రూట్ వరుస సెంచరీలతో సిరీస్‌లో ప్రకంపనలు సృష్టిస్తుండగా కోహ్లి మాత్రం ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేక పోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లోనూ కోహ్లి అంతంత మాత్రంగానే రాణించాడు. లీడ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కాస్త బాగానే ఆడినా జట్టును ఆదుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. ఇక కీలకమైన ఓవల్ మ్యాచ్‌లో కోహ్లి రాణించక తప్పదు. గతంలో ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తూ రన్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లి కొన్నేళ్లుగా ఘోరంగా విఫలమవుతున్నాడు. ఒకప్పుడూ వరుస సెంచరీలతో ప్రపంచ క్రికెట్లో ఎదురులేని శక్తిగా మారిన కోహ్లి ఇటీవల కాలంలో ఆ స్థాయిలో ఆడలేక పోతున్నాడు. అతని వైఫల్యం టీమిండియాపై బాగానే ప్రభావం చూపుతుందని చెప్పాలి. ఇప్పటికైనా కోహ్లి తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు రిషబ్ పంత్ కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచ లేక పోతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పంత్ చెత్త బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. ఈసారైనా అతను మెరుగైన ఇన్నింగ్స్ ఆడాలి. పంత్ వైఫల్యం టీమిండియా బ్యాటింగ్‌పై బాగానే పడుతోంది. దీంతో పంత్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకంగా తయారైంది. మరోవైపు లీడ్స్ మ్యాచ్‌లో అంతగా ప్రభావం చూపని బౌలర్లు కూడా నాలుగో టెస్టులో మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా బదులు మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. అంతేగాక యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు కూడా టీమిండియాలో చోటు దక్కింది. దీంతో ఇషాంత్‌ను తప్పించి అతన్ని తుది జట్టులో ఆడించినా ఆశ్చర్యం లేదు.
జోరుమీదున్న రూట్ సేన
ఆతిథ్య ఇంగ్లండ్ జోరుమీదుంది. లీడ్స్ మ్యాచ్ విజయంతో రూట్ సేన ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. రూట్‌తో పాటు ఇతర బ్యాట్స్మెన్లు కూడా ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఇక ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాడు జోస్ బట్లర్ లేకుండానే ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది. అతను లేకున్నా బెయిర్‌స్టో, మలాన్, రూట్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లోనూ ఆతిథ్య టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.