అల్‌ఖైదా ప్రకటన
ప్రకటన వెనుక పాక్ హస్తముందని కేంద్రం అనుమానం
న్యూఢిల్లీ: ఆఫ్ఘన్‌నుంచి మంగళవారం రాత్రి అమెరికా చిట్టచివరి సైనికుడు వెళ్లిపోయిన వెంటనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖౌదా తాలిబన్లకు కంగ్రాట్స్ చెప్పింది. ఇలాగే ఇస్లామేతర శక్తులనుంచి కశ్మీర్‌ను కూడా విడిపించుకుంటామని ప్రకటించింది. అయితే అల్‌ఖైదా తన ప్రకటనలో కశ్మీన్ను చేర్చడం, చెచెన్యా, జింగ్జియాంగ్ ప్రస్తావన లేకపోవడం వెనుక పాక్ హస్తముందని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. ‘ ఇస్లాం శత్రువులనుంచి లెవాంట్, సోమాలియా, యెమెన్, కశ్మీర్ సహా ఇతర ముస్లింల భూభాగాలన్నిటినీ విడిపించుకుందాం. ఓ అల్లా ప్రపంచంలోని ముస్లిం ఖైదీలందరికీ విముక్తి ప్రసాదించు’ అనిఆ ప్రకటనలో అల్‌ఖైదా పేర్కొంది. అయితే ‘అల్‌ఖైదా ప్రపంచంలోని ముస్లింలందరినీ రాడికల్ వాదులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇదిమానవాళికే ప్రమాదకరం. పాకిస్తాన్ తన అజెండాను ఈ విధంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది’ అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఈ ప్రకటన భారత్‌లో దాడులు చేయడానికి పాక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహహ్మద్లాంటి సంస్థలకు మరింత ధైర్యాన్ని అందిస్తున్నాయి అని కూడా ఆ అధికారి చెప్పారు. అంతేకాదు అల్‌ఖైదా చీఫ్ అయమాన్ అల్ జవహరికి ఆశ్రయం కల్పించడంతో పాటుగా ఆయనను చీఫ్‌గా నియమించే విషయంలో కూడా పాక్ హస్తం ఉందని ఆ అధికారి చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాలిబన్ సుప్రీం కమాండర్ హైబతుల్లా అఖుండ్జాదా పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కస్టడీలోనే ఉండడం గమనార్హం.
కాగా అల్ ఖైదా సానుభూతిపరులు, ఉగ్రవాదుల కుటుంబ సభ్యులు చాలా మంది ప్రసుతం ఇరాన్లో ఉంటున్నారు. వారంతా ఇప్పుడు తిరిగి అఫ్ఘన్‌కు వచ్చేస్తారని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అఫ్ఘన్ షియాల ప్రాబల్యం ఉండే దేశమైనప్పటికీ, వ్యూహాత్మక అడ్వాంటేజిల విషయానికి వచ్చే సరికి షియాలు, సున్నీలు ఇద్దరూ కలిసి చేసే అవకాశాలు ఉన్నాయని చరిత్ర చెబుతోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నారు. తాము ఇప్పుడు భిన్నమైన వాళ్లమని తాలిబన్లు ప్రపంచానికి చెబుతున్నప్పటికీ ఈ హామీలు ఎంతవరకు నెరవేరుతాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. కశ్మీర్ విషయంలో తాలిబన్లు పూర్తి ఆసక్తి కనబరచకపోయినప్పటికీ కశ్మీర్లోకి ఉగ్రవాదులను చొప్పించడానికి అఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి హర్కతుల్ అన్సర్లాంటి పలు ఉగ్రవాద సంస్థలను అది గతంలో అనుమతించింది. ఈ పరిణామాలన్నిటినీ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తూ ఉంది.