కేంద్ర ఐటి మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను కలిసి కోరిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటిఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్)ప్రాజెక్ట్ పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈమేరకు గురువారం నాడు కేంద్ర ఐటి, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి కెటిఆర్ చర్చించారు. ప్రదానంగా ఐటిఆర్ ప్రాజెక్టును పునరుద్దరించాలని తెలంగాణ ప్రభుత్వ పలుమార్లు కోరినప్పటికీ కేంద్రం నుంచి కదలిక రావడం లేదన్నారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గత 6 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారన్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే దివిటిపల్లిని ఇఎంసి-2.0 (ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్) స్కీమ్ కింద ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్, విస్తరణకు సహకారం అందించాలని కూడా కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ తయారుపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇందుకోసం దుండిగల్ వద్ద 450 ఎకరాల భూమి గుర్తించిందని కేంద్ర మంత్రికి ఆయన వివరించారు. అలాగే గ్రామ పంచాయితీలను అనుసంధానించడానికి టి…ఫైబర్ కింద భారత్ నెట్ ఫేజ్.. -II ప్రాజెక్ట్ అవగాహన ఒప్పందం మేరకు చెల్లింపులను విడుదల చేయాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ కోరారు. రాష్ట్రంలో ఎన్‌ఒఎఫ్‌ఎన్(నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్) ఫేజ్.. I నెట్‌వర్క్‌ను టి-ఫైబర్‌కి అప్పగించాలని అభ్యర్ధించారు. గ్రామ పంచాయతీల నుండి చిన్న గ్రామాలను అనుసంధానించే ప్రాజెక్టుకు రూ. 1200 కోట్ల అదనపు నిధుల కేటాయించాలని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఇది ఐటి రంగ వృద్ధిలో అద్భుతమైన ఊపునిస్తుందని పేర్కొన్నారు..