కేవడియా : ( గుజరాత్ ) : ప్రధానిగా మోడీ 2014 లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎలాంటి భారీ ఉగ్రదాడి జరగలేదని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండడంపై ఉగ్రవాదులు భయపడుతున్నారని దేశ రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ వెల్లడించారు. గుజరాత్ నర్మదా జిల్లా కేవడియాలో మూడు రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర బిజెపి ఎగ్జిక్యూటివ్ సమావేశం రెండో రోజున గురువారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్మీ జవాన్లకు సంబంధించి గత 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వన్ రాంక్ వన్ పెన్షన్ ( ఒఆర్‌ఒపి )పై కాంగ్రెస్ పార్టీ అంతగా పట్టించుకోక పోగా, మోడీ దాన్ని వెంటనే అమలు చేయగలిగారని కాంగ్రెస్ ప్రభుత్వానికి, బిజెపి ప్రభుత్వానికి గల తేడా ఇదేనని వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదుల యురి దాడి తరువాత పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తాము సర్జికల్ దాడులు నిర్వహించడంతో అవసరమైతే తాము సరిహద్దులను దాటైనా సరే ఉగ్రవాదులను హతమారుస్తామని ప్రపంచ దేశాలకు సంకేతం ఇచ్చినట్టయిందని తెలిపారు. అయోధ్య రామాలయం గురించి ప్రస్తావిస్తూ అలాంటి అంశాలు కేవలం నినాదాలకు పరిమితం కారాదని, బాబ్రీ మసీదు కూల్చి వేత తరువాత తమ పార్టీ మూడు రాష్ట్రప్రభుత్వాలను త్యాగం చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. డిఫెన్స్ ఎక్స్‌పో 2022 నిర్వహణపై గుజరాత్ ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వశాఖ మధ్య మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. గాంధీ నగర్‌లో వచ్చే ఏడాది మార్చి 10 నుంచి 13 వరకు డిఫెన్స్ ఎక్స్‌పో 2022 జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు.