ఈ నెలతో ఐరాస తిండిగింజలు ఖాళీ
మూడొంతుల మంది పస్తులు?
ముగిసీముగియని సుదీర్ఘయుద్ధ కాలం
కరకు ఘట్టంగా కరువుకాటకాలు
కాబూల్ : సుదీర్ఘకాలపు అంతర్యుద్ధాల అఫ్ఘనిస్థాన్‌లో ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. దేశంలో ఏర్పాటు కాబోయే నూతన తాలిబన్ ప్రభుత్వానికి ఇది మరో కీలకమైన సంక్లిష్ట సవాలుగా మారనుంది. ఓ వైపు అధికార స్థాపన, మరో వైపు అఫ్ఘన్లందరికీ తమ రాక పట్ల సదభిప్రాయం ఏర్పాటు అయ్యేలా చూసుకోవడం, ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో తలెత్తుతున్న ప్రతిఘటనలతో తాలిబన్లు సతమతమవుతున్నారు. దీనికి తోడు ఆకలి సంక్షోభాన్ని కూడా వీరు ఎదుర్కోవల్సి ఉంటుంది. దేశంలో పేదల పంపిణీకి ఉద్ధేశించి ఐక్యరాజ్యసమితి అందించిన ఆహారధాన్యాల నిల్వలు ఈ నెలతో అడుగంటిపోతాయని సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. ప్రస్తుత కల్లోల పరిస్థితితో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయం, మరో వైపు రోజువారి కూలీలకు చేయడానికి పనిలేకుండా పోవడం వంటి పరిణామాలతో వారు పస్తులు ఉండే దుస్థితి నెలకొంది.
దేశంలోని మూడుకోట్ల ఎనభైలక్షల మంది జనాభాలో దాదాపు మూడోంతుల మందికి తమకు రోజు వారి తిండి దొరుకుతుందా? అనేది అనుమానాస్పదం అయింది. కోట్లాది మంది పరిస్థితి దయనీయంగా ఉందని దేశంలోని మానవీయ సహాక కార్యక్రమాల చీఫ్ రమిజ్ అలక్‌బరోవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐరాస అనుబంధమైన ప్రపంచ ఆహార పంపిణీ కార్యక్రమం పరిధిలో ఇటీవలి వారాలలో దేశానికి ఆహారధాన్యాలను తరలించారు. వీటిని వేలాది మందికి పంపిణీ చేశారు. దేశంలో చలికాలం సమీపిస్తూ ఉండటం , కరువుకాటకాల పరిస్థితి తలెత్తడంతో కనీసం రెండుకోట్ల మందికి అయినా ఆహారం అందించాల్సిన అవసరం ఉందని రమీజ్ చెప్పారు. ఈ దశలో బాధిత అణగారిన ప్రజలను ఆదుకునేందుకు కనీసం రెండుకోట్ల డాలర్ల నిధి అత్యవసరం అవుతుంది. ఇది అందితేకానీ రెక్కాడితే కానీ డొక్కాడని పేద వర్గాలకు అంతో ఇంతో తిండిపెట్టే పరిస్థితి లేదని స్పష్టం అయింది. ఓవైపు తీవ్రస్థాయిలో తాలిబన్ల రాకపై భయాందోళనలు, తిరిగి ముసురుకుంటున్న ముళ్లకంచెలు, అంతర్జాతీయ సమాజం నుంచి ఎటువంటి సా యానికి వీల్లేని పరిస్థితి మధ్య దిక్కుమొక్కులేని వారి పరిస్థితి గురించి ఏమిటనేది అగమ్యగోచం అయింది. ఈ నెలాఖరుతో ఆహారధాన్యాలు అడుగంటుతున్నాయి. ఐ రాస సహాయక పథకం పరిధిలో ఈ కోటా తిరిగి వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు నిల్వ లు లేకపోవడంతో వచ్చే నెల నుంచి పేదలకు ఆహారం పంపిణీ చేయడం కుదరదని అలక్‌బరోవ్ అన్నారు.
130 కోట్ల డాలర్ల సాయం అవసరం
పలు విధాలుగా నలిగిపోయిన అఫ్ఘనిస్థాన్‌కు కనీసం 130 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అవసరం అని వివిధ దశల విశ్లేషణల క్రమంలో ఐరాస అధికారులు ఇంతకుముందు తెలిపారు. అయితే ఇందులో కేవలం 39 శాతం ఇప్పటివరకూ అందింది. అమెరికా అండదండలతో సాగిన సర్కారు హయాంలోనే ఐరాస ఇతర అంతర్జాతీయ సంస్థల సాయం అంతంతగా అందినప్పుడు, గుర్తింపు దక్కని తాలిబన్ల సర్కారు దశలో ఈ సాయం పరిస్థితిపై పలు నీలినీడలు పర్చుకుంటున్నాయి.
ఉద్యోగులకు జీతాలు లేవు
పేదలకు తిండికి కటకట పరిస్థితి ఈ విధంగా ఉండగా ప్రభుత్వోద్యోగాలలో ఉండే మధ్యతరగతి వారికి ఆర్థిక దుస్థితి కారణంగా నెలల తరబడిగా జీతాలు అందడం లేదు. పైగా స్థానిక అఫ్ఘన్ కరెన్సీకి రోజురోజుకూ విలువ పతనం అవుతోంది. పైగా అమెరికా ఇతరదేశాలలో ఉన్న అఫ్ఘన్ బ్యాంకుల ఫారెన్ రిజర్వ్‌లను స్తంభింపచేశారు. దీనితో అఫ్ఘన్‌కు చెందిన ఆస్తులు కోట్లాది డాలర్లు ఇప్పుడు దేశ అవసరాలకు దక్కని పరిస్థితి ఉంది. ఇప్పుడు దేశం అత్యంత పేలవమైన స్థితిలో ఉందని అఫ్ఘన్ మాజీ ఆర్థిక మంత్రి ఖలీద్ పయేంద తెలిపారు. ఆయన వాషింగ్టన్‌లోని జార్జిటౌన్ వర్శిటీలో దేశ పరిస్థితిపై ఉపస్యసించారు. ద్రవ్యమారకం స్తంభించి పోవడంతో ఇప్పటికైతే కరెన్సీ పతనం చెందలేదు కానీ ఇది అనివార్యం అవుతుందన్నారు. ఇక దీని విలువ వందశాతం పైగా పడిపోతుందన్నారు.