తమ హక్కు అన్న తాలిబన్లు
ఇస్లామాబాద్ : కశ్మీర్‌తో పాటు ప్రపంచంలో ఏ మూల ఉన్న ముస్లింల పక్షాన అయినా తాము గళమెత్తుతామని తాలిబన్లు ప్రకటించారు. ఇది తమ హక్కు అని, దీనిని ఎవరూ కాదనలేరని తాలిబన్ల ప్రతినిధి సుహేల్ షహీన్ స్పష్టం చేశారు. దోహాలో తాలిబన్ల రాజకీయ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధిగా సుహేల్ వ్యవహరిస్తున్నారు. అఫ్ఘనిస్థాన్‌ను ఇప్పుడు ఉగ్రవాద శక్తులు తమ ప్రధాన కేంద్రం చేసుకునే అవకాశాలు ఉన్నాయని భారతదేశం ఆందోళన చెందుతోంది. ఈ దశలోనే కశ్మీర్ అంశం, అక్కడి ముస్లింల గురించి తాలిబన్ల ప్రతినిధి బిబిసికి ఇచ్చిన ఇంటర్వూలో ప్రస్తావించడం కీలకమైంది. ముస్లింల తరఫున మాట్లాడే స్వేచ్ఛ సంబంధిత హక్కు తమకు ఉందని ఈ ప్రతినిధి తెలిపారు. అది కశ్మీర్ అయినా ప్రస్తావించి తీరుతామన్నారు.
ముస్లింలు కూడా దేశ పౌరులే, సొంత జనులే, దేశాల సొంత చట్టాల పరిధిలో వారికి సమాన హక్కులు ఉన్నాయనే విషయాన్ని తాము పలు వేదికల నుంచి చెప్పితీరుతామని తాలిబన్ల ప్రతినిధి వీడియో లింక్ ద్వారా ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు. కశ్మీరీ ముస్లింల సమస్యలుంటే వాటి గురించి కూడా ప్రస్తావించడం జరుగుతుందని, ఇది తమ హక్కు అని తేల్చిచెప్పారు. ఇక అమెరికాతో ఇంతకు ముందు కుదిరిన దోహా ఒప్పందం గురించి మాట్లాడుతూ ఇతర దేశాలకు వ్యతిరేకంగా సైనిక చర్యలకు దిగడం, లేదా ఇతర దేశాలలో వేరే దేశం సైనిక కార్యకలాపాలు నిర్వహించడం కుదరదని, ఈ విధమైన పాలసీ ఏదీ లేదని ఈ ఇంటర్వూలో ఆయన అమెరికాకు పరోక్ష చురకలు పెట్టారు.