ఢిల్లీలో నరేంద్ర మోడీతో సిఎం కెసిఆర్ భేటీ
యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ ఆహ్వానం
50ని॥ల పాటు సాగిన సమావేశం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వినతులతో పది లేఖలను ప్రధానికి అందజేసిన
ముఖ్యమంత్రి ఐపిఎస్‌ల కోటాను మరింత పెంచాలి ఐఐఎంను మంజూరు చేయాలి హైదరాబాద్నాగ్పూర్
పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ప్రధాన మంత్రి సడక్ యోజనకు అదనపు నిధులు ప్రధానమంత్రి గ్రామీణ యోజన
మెరుగుదలకు తగు చర్యలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కరీంనగర్లో ట్రిపుల్ ఐటి 21 కొత్త
జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు స్థలం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం భేటి అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నరేంద్రమోడీని ఆయన నివాస భవనంలో కలుసుకొని చర్చించారు. చర్చించారు. సుమారు యాభై నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో పది అంశాల ప్రతిపాదనలకు సంబంధించిన లేఖలను కూడా ప్రధానికి సిఎం కెసిఆర్ అందజేశారు. వాటిల్లో ప్రధానంగా తెలంగాణకు ఐపిఎస్‌ల కోటా పెంచాలని కోరారు. అలాగే రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2వేల ఎకరాలకు పైగా స్థలాన్ని హెచ్‌సియు క్యాంపస్‌కు కేటాయించిందని లేఖలో సిఎం పేర్కొన్నారు. పలు రాష్ట్రాలకు ఐఐఎంలను ఇప్పటికే కేంద్రం కేటాయించిందన్నారు.
కానీ తెలంగాణకు మాత్రం కేటాయించలేదని ప్రధానికి ఇచ్చిన లేఖలో సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఎపి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెంటనే గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్…నాగపూర్ పారిశ్రామిక కారిడార్‌ను కూడా ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ కోరారు. ఇక రాష్ట్రంలో కొత్త జిల్లాలకు అనుణంగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ యోజన మెరుగుపరచడం కోసం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, కరీంనగర్లో ట్రిపుల్ ఐటి మంజూరు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీని సిఎం కెసిఆర్ కోరారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం (2014)ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలను సంఖ్యను పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. అప్పుడున్న 10 జిల్లాలను 33 జిల్లాలలో పునర్వ్యవస్థీకరించడం ద్వారా జిల్లా పరిపాలనలో పునర్నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మెరుగైన పరిపాలనా సౌలభ్యం కోసం, సుదూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా అందించడం కోసం ఈ ప్రక్రియను చేపట్టామన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియలో సమర్ధులకు న్యాయం చేయడం కోసమే ఆర్టికల్ 371కింద ఉన్న జోనల్ వ్యవస్థను పూర్తిగా సవరించామన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందన్నారు.
ఈ నేపథ్యంలో పోలీసు విభాగాల యొక్క కొత్త పరిపాలనా ఏర్పాటు కారణంగా పోలీసు చట్టం 1961 ప్రకారం చట్టబద్ధమైన బాధ్యతలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వ నోటిఫికేషన్లకు అనుగుణంగా కొత్త ప్రాదేశిక పోస్టులను సృష్టించడం తక్షణ అవసరమని ప్రధానికి ఇచ్చిన లేఖలో సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపిఎస్లో కోటాను మరింతగా పెంచాలని కోరుతూ ఒక లేఖను సిఎం కెసిఆర్ అందజేశారు. అలాగే ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్… తెలంగాణ భవన్‘ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని సిఎం కోరారు. అలాగే యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని కోరారు. సిఎం చేసిన అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జవహార్ నవోదయ విద్యాలయ పాలసీ కింద తెలంగాణ రాష్ట్రంలో 21 జిల్లాలో సదరు పాఠశాలు నెలకొల్పాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాష్టంలో కేవలం రంగారెడ్డి, కొమరం భీమ్, వరంగల్ (అర్బన్), నాగర్‌కర్నూల్, నల్గొండ, సిద్దిపేట్, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి (9) జిల్లాల్లోనే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో మరో 21 జిల్లాలు ( ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, నిజమాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ (రూరల్), జనగాం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట్, యాదగిరి భువనగిరి, మహబూబ్‌నగర్, సూర్యాపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి)లకు పాఠశాలలను మంజూరు చేయాలని కోరారు.
హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయండి
హైదరాబాద్…-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడిని సిఎం కెసిఆర్ కోరారు. జాతీయ రహదారి 44పై హైదరాబాద్…నాగపూర్ మధ్య శరవేగంగా సరకు రవాణా కోసం ఈ కారిడార్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కారిడార్ నిర్మాణం 585 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నేపథ్యంలో హైదరాబాద్, రంగా రెడ్డి, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మహరాష్ట్రలోని చంద్రపూర్, వార్ధా ,నాగ్‌పూర్ జిల్లాలను ప్రభావితం చేస్తుందని ప్రధాని దృష్టికి సిఎం కెసిఆర్ తీసుకొచ్చారు. పైగా తెలంగాణ, మహరాష్ట్రాలకు చెందిన 27శాతం మంది ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
టెక్స్టైల్స్ పార్కు నిర్మాణం కోసం రూ.1000 కోట్లు గ్రాంటుగా ఇవ్వండి
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం కోసం రూ. 1000 కోట్ల నిధులను గ్రాంటు.. ఇన్..ఎయిడ్‌గా మంజూరు చేయాలని ప్రధాని నరేంద్రమోడిని సిఎం కెసిఆర్ కోరారు. ఈ టెక్స్టైల్ పార్కును ప్రపంచ ప్రమాణాలకు దీటుగా అత్యాధునిక తయారీ సౌకర్యాల కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని కోసం రూ.1600 కోట్లు అవసరమన్నారు. ఈ పార్కులో అత్యాధునిక తయారీ సౌకర్యాలు, ఇంటిగ్రేటెడ్ ఉమ్మడి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందన్నారు. టెక్స్టైల్, దుస్తులు పరిశ్రమ కోసం వరంగల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండువేల ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందన్నారు. టెక్స్టైల్ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ నేపథ్యంలో టెక్స్టైల్స్ పార్కు అభివృద్ధి కోసం కేంద్రం గ్రాంటుగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.
గిరిజన యూనివర్సిటిని మంజూరు చేయండి
ఎపి విభజన చట్టం ప్రకారం తెలంగాణ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని ప్రధానికి సిఎం కెసిఆర్ మరోమారు గుర్తు చేశారు. దీనిని షెడ్యూల్ 13 (3), సెక్షన్ 94లో కూడా పొందుపరిచారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో 200 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందన్నారు. దీనికి కేంద్రం కూడా సముఖతను వ్యక్తం చేసిందని ప్రధానికి ఇచ్చిన లేఖలో సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గిరిజన యూనివర్సిటి ఏర్పాటుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ భవన్ కు స్థలం కేటాయించండి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన సందర్భంగా, అన్ని రాష్ట్రాలకు ఢిల్లీ కేంద్రంగా భవనాలు వున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా అధికారిక భవనం ‘తెలంగాణ భవన్‘ నిర్మించుకునేందుకు ఢిల్లీ లో అనువైన చోట స్థలం కేటాయించాలని ప్రధానిని సిఎం కెసిఆర్ కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని, భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని సిఎంకు హామీ ఇచ్చారు.
యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీని ఈ సందర్భంగా సిఎం ఆహ్వానించారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆల య ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సిఎం తెలిపారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తప్పకుండా హాజరవుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు.