ఢాకా: న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20లో ఆతిథ్య బంగ్లాదేశ్ 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు సాధించింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. కెప్టెన్ టామ్ లాథమ్ చివరి వరకు జట్టును గెలిపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు బ్లుండెల్, రచిన్ రవీంద్ర తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. బ్లుండెల్ ఆరు పరుగులు చేయగా, రవీంద్ర 10 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ లాథమ్ తనపై వేసుకున్నాడు. అతనికి విల్ యంగ్ అండగా నిలిచాడు. అతని సహకారంతో లాథమ్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే కీలక సమయంలో యంగ్ (22) ఔట్ కావడంతో కివీస్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన లాథమ్ ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 బంతుల్లో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే జట్టును గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, షకిబ్, నాసుమ్ అహ్మద్ మెరుగైన ప్రదర్శన చేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు నయీం, లిటన్ దాస్ శుభారంభం అందించారు. నయీం మూడు ఫోర్లతో 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధాటిగా ఆడిన దాస్ 3 ఫోర్లు, సిక్స్‌తో 33 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన మహ్మదుల్లా ఐదు ఫోర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో బంగ్లా స్కోరు 141 పరుగులకు చేరింది. తొలి టి20లో కూడా బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది.
Bangladesh Won by 4 runs against Kiwis in 2nd T20