కేప్ కెనావరెల్ : అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన పర్సెవరెన్స్ రోవర్ అంగారకుడిపైని రాతి నమూనాను విజయవంతంగా సేకరించింది. కొన్నేళ్ల తరువాత వీటిని భూమి మీదకు తీసుకొస్తారు. రాతి నమూనా అద్భుతంగా ఉందని రోవర్ ముఖ్య ఇంజినీర్ ఆడమ్ స్టెల్జనల్ తెలిపారు. ఈ నమూనా సేకరణ తమకెంతో ఆనందం కలిగించిందని ఆయన ట్వీట్ చేశారు. గత నెలలో రాతి నమూనా సేకరణకు పర్సవరెన్స్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆనాడు రోవర్ మృధువైన శిలకు డ్రిల్లింగ్ నిర్వహించింది. అయితే ఈ నమూనా ముక్కలైపోవడంతో రోవర్ లోని గొట్టం లోకి అది చేరుకోలేక పోయింది. దాంతో అక్కడకు అరమైలు దూరం రోవర్ ప్రయాణించి రొషెట్ అనే మరో శిలను ఎంపిక చేసుకుని అక్కడ నుంచి విజయవంతంగా నమూనాలను సేకరించ గలిగింది.
అంగారకుడిపై ఉన్న జెజెరో బిలంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో పర్సెవరెన్స్ దిగిన సంగతి తెలిసిందే. కోట్ల ఏళ్ల కిందట అక్కడ నది ప్రవహించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందువల్ల అక్కడి శిలల్లో పురాతన జీవానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పర్సవరెన్స్ సేకరించిన నమూనాలను భూమికి తీసుకురాడానికి ఐరోపా అంతరిక్ష సంస్థతో కలిసి నాసా ఈ దశాబ్దం చివర్లోగా మరికొన్ని వ్యోమనౌకలను పంపుతుంది. మొత్తం మీద 30 నమూనాలను భూమి మీదకు రప్పించాలని భావిస్తున్నారు. అంగారకుడిపై పర్సవరెన్స్ దిగిన ప్రదేశం నుంచి ఇప్పటివరకు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.