విల్లాలో పేకాడుతుండగా పట్టుకున్న పోలీసులు
తొమ్మిది మందిని మియాపూర్ పోలీసులకు అప్పగింత
మనతెలంగాణ, హైదరాబాద్ : పేకాట శిబిరంపై మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేసి తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,97,000 స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో కొందరు వ్యక్తులు పేకాడుతున్నారనే సమాచారం రావడంతో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. ఇందులో వినాయకుడు సినిమాలో హీరో నటించిన కృష్ణుడు పట్టుబడ్డాడు. అతడితోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మియాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత సొంత పూచీకత్తుపై వదిలేశారు, శనివారం సాయంత్రం విచారణకు రావాలని ఆదేశించారు. పేకాట శిబిరం నిర్వాహకుకడు పెద్ది రాజుతోపాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.