హైదరాబాద్: విద్యార్థులలో ఒత్తిడి, ఆందోళన, నిస్పృహ వంటి తదితర మానసిక రుగ్మతలకు పరిష్కారం చూపించడానికి వారికోసం ప్రత్యేక హెల్ప్ లైన్, కౌన్సిలింగ్ సెంటర్ల ఆవశక్యత ఎంతో ఉందని తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం డిఐజి సుమతి అన్నారు. ఆత్మహత్యలు లేని సమాజం అన్న లక్ష్యంతో నెలకొల్పబడిన లాభాపేక్ష లేని ‘వన్ లైఫ్’ సామాజిక సేవాసంస్థ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్(78930 70049), పాఠశాలల కోసం ప్రత్యేక కౌన్సిలర్ తో కూడిన వర్చువల్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఆదివారం డిఐజి సుమతి ప్రారంభించారు.
‘1లైఫ్’ సంస్థ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నలంద విద్యా సంస్థలలో(వెంగళరావ్ నగర్) జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో యూ అండ్ మీ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్, నలంద విద్యాసంస్థల చైర్మెన్ మంతెన శ్రీనివాస రాజా తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సదుపాయాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చినందుకు ‘1 లైఫ్’ సంస్థను డిఐజి సుమతి అభినందించారు.
అనంతరం లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. ”నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సిఆర్బి) సేకరించిన డేటా ప్రకారం భారతదేశంలో ప్రతి గంటకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రతిరోజూ 28మంది విద్యార్థుల ఆత్మహత్యలు నివేదించబడుతున్నాయి. ఎందుకంటే విద్యార్థులలో కలిగే ఒత్తిడి, భయాలు, డిప్రెషన్, మానసిక సమస్యలు కుటుంబాలలో సాధారణంగా చర్చించబడవు. విద్యార్థులు భయాలు, వివిధ అపోహల కారణంగా కౌన్సెలింగ్ కు కూడా వెళ్ళి తమ సమస్యలను చెప్పుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలల కోసం అంకితమైన స్టూడెంట్ హెల్ప్ లైన్(78930 70049), వర్చువల్ కౌన్సిలింగ్ ఉండటం వలన విద్యార్థులు తమ తమ సందేహాలను, అపోహలను నిర్భయంగా చెప్పుకోగల్గుతారు” అని అన్నారు. ‘వన్ లైఫ్’పై మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
DIG Sumathi launches 1Life helpline for Students