టోక్యో: జపాన్ రాజధాని టోక్యో మనకు బాగా కలిసొచ్చింది. మన ఆటలకు ఓ కొత్త ఊపునిచ్చింది. ఒలింపిక్స్‌లో మన అథ్లెట్లు సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 7 మెడల్స్‌తో ఒక ఒలింపిక్స్‌లో అత్యధిక మెడల్స్ గెలిచిన రికార్డును ఇండియన్ అథ్లెట్లు సృష్టించారు. లండన్ గేమ్స్ (6 మెడల్స్) రికార్డు బద్ద్ధలైంది. ఇప్పుడు పారాలింపియన్లు కూడా అదే రూట్లో వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 19 మెడల్స్ గెలిచారు. దివారం చివరి రోజు బ్యాడ్మింటన్‌లో ఓ గోల్డ్, ఓ సిల్వర్ మెడల్ వచ్చాయి. టోక్యో పారాలింపిక్స్( Tokyo Paralympics )కు ముందు ఇండియా ఒక పారాలింపిక్స్‌లో సాధించిన అత్యధిక మెడల్స్ 12 మాత్రమే. ఇప్పుడు అంతకంటే చాలా ఎక్కువ మెడల్స్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఇందులో ఐదు గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి. ఈసారి కూడా మన పారా అథ్లెట్లు అంచనాలకు తగినట్లుగా రెండంకెల మెడల్స్ తీసుకొస్తారని ముందే ఊహించినా.. ఈ స్థాయి ప్రదర్శన మాత్రం ఆశ్చర్యం కలిగించేదే. ఈ రికార్డు మెడల్స్‌లో ఎన్నో కళ్లు చెదిరే ప్రదర్శనలు ఉన్నాయి.
అవని లెఖారా.. ఏకైక ఇండియన్
షూటింగ్ల్ అవని లెఖారా ఈసారి ఇండియా తరఫున తొలి గోల్డ్‌మెడల్ సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో ఆమె తొలి స్థానంలో నిలిచింది. గతంలో ఏ భారతీయ మహిళ కూడా పారాఅథ్లెట్ కూడా గోల్డ్ సాధించలేదు. ఇదే ఓ అద్భుతమైన రికార్డు అనుకుంటే.. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో బ్రాంజ్ గెలిచి మరో చరిత్ర సృష్టించింది. ఇండియా తరఫున ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన వ్యక్తి మరొకరు లేరు.
రికార్డులు వీళ్లవే..
ఇండియా సాధించిన మొత్తం 19 మెడల్స్‌లో 5 గోల్డ్‌కాగా.. మరో 8 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఈ మెడల్స్‌లోనూ మనవాళ్లు కొన్ని కొత్త రికార్డులు సృష్టించారు.
* సుమిత్ అంటిల్ – ఎఫ్64 మెన్స్ జావెలిన్లో ప్రపంచ రికార్డు (గోల్డ్ మెడల్)
*అవని లెఖారా- ఆర్2 వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1లో ప్రపంచ రికార్డు సమం. కొత్త పారాలింపిక్ రికార్డు (గోల్డ్)
* మనీష్ నర్వాల్ – పీ4 మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 పారాలింపిక్ రికార్డు (గోల్డ్)
* నిషాద్ కుమార్ – మెన్స్ టి47 హైజంప్‌లో ఏషియన్ రికార్డు (సిల్వర్)
* ప్రవీణ్ కుమార్ – మెన్స్ హైజంప్ టి 64లో ఏషియన్ రికార్డు (సిల్వర్)
మన దేశం ఈసారి పారాలింపిక్స్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా 54 మంది పారాఅథ్లెట్లును పంపించింది. వీళ్లు 9 క్రీడల్లో పాల్గొన్నారు. తొలిసారి బ్యాడ్మింటన్, తైక్వాండో టోక్యో పారాలింపిక్స్‌లో ఎంట్రీ ఇచ్చాయి. 1968లో తొలిసారి పారాలింపిక్స్‌లో పాల్గొన్న ఇండియా.. 2016 రియో పారాలింపిక్స్‌లో 12 మెడల్స్ సాధించింది. ఆ రికార్డును ఇప్పుడు అధిగమించింది. మొత్తం 162 దేశాలు పాల్గొన్న ఈ గేమ్స్‌ల్లో 19 పతకాలతో ఇండియా 24వ స్థానంలో నిలిచింది.
మెడల్స్ సాధించింది వీళ్లే
గోల్డ్‌మెడల్స్ సాధించిన వాళ్లలో అవని లెఖారా (షూటింగ్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), కృష్ణ నగార్ (బ్యాడ్మింటన్), సుమిత్ అంటిల్ (జావెలిన్ త్రో), మనీష్ నర్వాల్ (షూటింగ్).
సిల్వర్ మెడల్స్ సాధించిన వాళ్లలో.. భవీనాబెన్ పటేల్ (టేబుల్ టెన్నిస్), సింఘ్రాజ్ (షూటింగ్), యోగేశ్ కథూనియా (డిస్కస్ త్రో), నిషాద్ కుమార్ (హైజంప్), మరియప్పన్ తంగవేలు (హైజంప్), ప్రవీణ్‌కుమార్ (హైజంప్), దేవేంద్ర ఝఝారియా (జావెలిన్ త్రో), సుహాస్ యతిరాజ్ (బ్యాడ్మింటన్). కాంస్య పతకాలు గెలిచిన వాళ్లలో.. అవని లెఖారా (షూటింగ్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ), శరత్‌కుమార్ (హైజంప్), సుంద్ సింగ్ గుర్జార్ (జావెలిన్ త్రో), మనోజ్ సర్కార్ (బ్యాడ్మింటన్), సింఘ్రాజ్ (షూటింగ్).
ఈసారి అత్యధికంగా అథ్లెటిక్స్‌లో 8 మెడల్స్ రాగా.. షూటింగ్‌లో 5, బ్యాడ్మింటన్‌లో 4, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్‌లో ఒక్కో మెడల్ వచ్చింది. ఆర్చరీ, టేబుల్ టెన్నిస్లలో ఇండియా మెడల్స్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్ 6లో కృష్ణ నాగర్ గోల్డ్‌మెడల్ సాధించాడు. హాంకాంగ్ ప్లేయర్ కైమన్ చూతో జరిగిన ఫైనల్‌లో 21-17, 16-21, 21-17తో విజయం సాధించాడు. దీంతో బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. శనివారం జరిగిన ఎస్‌ఎల్ 3 విభాగంలో ప్రమోద్ భగత్ బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.
సుహాస్ యతిరాజ్‌కు రజతం
టోక్యో పారాలింపిక్స్‌ల్లో భారత్‌కు మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్ 4 విభాగం ఫైనల్లోప్రపంచ నంబర్ వన్, ఫ్రాన్స్ షట్లర్ మజుర్ లుకాస్ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయాడు. దీంతో సుహాస్ రజతంతో ఇంటికి తిరుగు పయనమయ్యారు. సుహాస్ యతిరాజ్ ఉత్తరప్రదేశ్‌లో ఐఎఎస్ అధికారిగా పని చేస్తున్నారు.
పతాకధారిగా అవని
విశ్వక్రీడల్లో మనదేశం తరఫున స్వర్ణం సాధించిన తొలి మహిళా అథెట్‌గా రికార్డు సృష్టించిన అవని.. టోక్యో పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనుంది. ఆదివారం జరుగనున్న కార్యక్రమంలో అవని త్రివర్ణ పతాకాన్ని చేబూని ముందు నడవనుండగా.. భారత్ నుంచి 11 మంది ముగింపు వేడుకల్లో పాల్గొననున్నారు.
ముగిసిన పారాలింపిక్స్
టోక్యో పారాలింపిక్స్ అధ్యాయం ఆదివారం ముగింపు దశకు చేరుకుంది. జపాన్ చక్రవర్తి నరుహిటో సోదరుడు క్రౌన్‌ప్రిన్స్ అకిషినో పర్యవేక్షణలో రంగురంగుల విద్యుద్దీపాల మధ్య బాణాసంచా వెలుగులతో నేషనల్ స్టేడియం కళకళలాడింది. 13 రోజులుగా వివిధ అంశాల్లో పోటీపడిన క్రీడాకారులతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది. ముగింపు వేడుకలకు ‘హార్మోనియస్ కాకోఫోనీ’ అని పేరు పెట్టారు. పలువురు నటులు, వైకల్యాలున్న ఇతరులు పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో భారత్‌నుంచి అవని లేఖరా త్రివర్ణ పతాకంతో ముందు నడిచింది. ముగింపు వేడుకలకు భారత బృందంలోని మొత్తం 11 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా 96 స్వర్ణాలు సహా మొత్తం 207 పతకాలతో చైనా మొదటి స్థానంలో నిలవగా, బ్రిటన్ 41 స్వర్ణాలతో మొత్తం124 పతకాలతో రెండో స్థానం,అమెరికా 37 స్వర్ణాలతో మొత్తం 104 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచాయి.