గణేశ్ ఉత్సవాల అనంతరం ఉభయసభలు సమావేశం కానున్నట్టు సమాచారం
నియమం ప్రకారం ఈ నెల 25లోపు అసెంబ్లీ సమావేశాలు మొదలుకావాల్సి వుంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈనెల చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. వార్షిక బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆరునెలలు కానుండడంతో గణేశ్ ఉత్సవాల అనంతరం ఉభయ సభలు సమావేశం కానున్నట్లుగా సమాచారం. ఈ విషయంపై ఢిల్లీ నుంచి తిరిగివచ్చాక సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25లోపు ఉభయసభలు భేటీ కావాల్సి ఉండటంతో, గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యాక ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు మార్చి 26వ తేదీన ముగిశాయి.
అప్పటి నుంచి ఆర్నెల్ల లోపు అంటే ఈ నెల 25వ తేదీ లోపు శాసనసభ, మండలి తిరిగి సమావేశం కావాల్సి ఉంది. జూన్ 1వ తేదీన ఉభయసభలను ప్రొరోగ్ చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్ జారీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈనెల పదో తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానుండటం వల్ల గణేశ్ నిమజ్జనం పూర్తయ్యాకే సమావేశాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి హస్తిన పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఈ విషయమై ఓ నిర్ణ యం తీసుకోవచ్చని సమాచారం. దళితబంధుతో పాటు ఇతర అంశా లు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బి ల్లులను ఉభయసభల ఆమోదం కోసం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.